హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో విడత ఉచిత బియ్యం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు నెలల వరకు కొనసాగించనున్న ఈ పథకం ద్వారా మనిషికి పది కిలోల చొప్పన ఉచిత బియ్యం డిసెంబర్ వరకు ఇవ్వనున్నారు. కరోనా సమయంలో ప్రారంభమైన ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పలు ధపాలుగా కేంద్రం పొడిగించింది. తాజాగా పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని డిసెంబర్ వరకు కేంద్రం పొడిగించింది. ఈ ప్రకటనతో రేషన్ లబ్ధిదారులు ఉచితంగా 5 కిలో బియ్యం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అంటే కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యం మొత్తం ఒక వ్యక్తికి 10 కిలోల చొప్పున డిసెంబర్ వరకు ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 90.01 లక్షల దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు ఈ పథకం వలన ప్రయోజనం పొందనున్నాయి. గతంలో ఒక కిలో బియ్యానికి రూపాయి చొప్పున చెల్లించాల్సివుండేది. తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు పది కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. డిసెంబర్ వరకు కొనసాగనున్న ఉచిత బియ్యం పథకాన్ని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.227.25 కోట్ల భారం పడనుందన్నారు.
రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు కలిగిన కుటుంబాల్లో 283.42 లక్షల లబ్ధిదారులు ఉన్నారన్నారు. వారిలో 54.37 లక్షల కార్డుదారులకు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత రేషన్‌ను కేంద్రం అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. వీరికి అదనపు బియ్యంతో పాటు మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షలమందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల కాలానికి పిఎంజికెఎవై పథకాన్ని పొడిగించిందని అందుకోసం కేవలం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.
వీటికి నెలకు 75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా 227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందన్నారు. పిఎంజికెఎవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు రూ.1308 కోట్లు ఖర్చు కేవలం బియ్యం కోసమే చేశామన్నారు. అలాగే వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1500 చొప్పున అందజేసిన వ్యయం రూ.2454 కోట్లు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సీఎం కేసీఆర్ ఆశయంతో మరో విడత పది కిలోల ఉచిత బియ్యం మరోసారి ప్రారంభించమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.