హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మహిళా భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్ర మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్న పోలీసు శాఖ ఇప్పటికే షీ టీమ్, హాక్ ఐ, డయల్ 100 తదితర విభాగాలను ప్రవేశపెట్టింది. వీటితో పాటు కొత్తగా పాసింజర్ కారులో ప్రయాణిస్తున్న వారు తమకు ఏదైనా ఆపద, ప్రమాదం జరిగితే కేవలం ఒక బటన్ నొక్కితే వెంటనే సమీపంలోని పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తగు రక్షణనిస్తాయి. ఈ విషయంలో ప్యాసెంజర్ కార్ సంస్థ ఉబెర్‌తో రాష్ట్ర మహిళా విభాగం కలిసి పని చేయనున్నాయి. ఈ విషయాలను ఉబెర్ సంస్థ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా సోమవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఉబెర్ యాప్‌తో పోలీసు శాఖ డయల్ 100తో అనుసంధానించడం వల్ల ప్రమాదానికి గురైన మహిళల రియల్ టై లొకేషన్, యూజర్ వివరాలు పోలీసులకు త్వరితగతిన అందుతాయని స్వాతిలక్రా తెలిపారు. తద్వారా అతి తక్కువ సమయంలోనే ప్రమాదంలో ఉన్న ప్రాణాలను రక్షించగలుగుతాయన్నారు. ఇందుకు గాను ఉబెర్ యాప్‌లో కొత్తగా ఎస్‌ఓఎస్ బటన్‌ను కొత్తగా ప్రవేశపెట్టారని వివరించారు. ట్రావెల్ కార్‌లో ప్రయాణించే మహిళలు తమకు ప్రమాదం ఉందని గమనిస్తే వెంటనే ఉబెర్ యాప్‌లో ఉన్న ఎస్‌ఓఎస్ బటన్‌ను ప్రెస్ చేస్తే వెంటనే సమీపంలోని పోలీస్ పెట్రోల్ కార్‌కు, బ్లూ కోల్ట్ పోలీసులకు, డయల్ 100 కు, సమీపంలోని ఎస్‌హెచ్‌ఓకు. కంట్రోల్ రూం, హాక్ ఐ లకు సమాచారం పోతుందని వివరించారు. దీంతో ఆ వాహనాన్ని జియో మ్యాప్ ద్వారా ట్రాక్ చేసి రక్షించడం జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసు శాఖ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ విధానం దేశంలోని ఇతర నగరాలకు కూడా ఆదర్శంగా మారుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.