Wednesday, November 20, 2024

TG | స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు మ‌రో ముందడుగు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకు వచ్చింది. మేఘా కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది.

వీటితో క్యాంపస్‌లో అవసరమైన అన్ని భవనాలను నిర్మించే బాధ్యతను యూనివర్సిటీ తీసుకుంది. ప్రపంచ స్థాయి అధునాతన మోడల్స్‌తో కూడిన అన్ని మౌలిక సదుపాయాలతో స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.

శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరిపింది. స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. కాగా, సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

అకడమిక్ భవనం, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని మేఘా కంపెనీ ఎండీ కృష్ణా రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులు రూపొందించిన యూనివర్సిటీ భవన నమూనాలు, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు.

- Advertisement -

వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement