Tuesday, November 26, 2024

టీడీపీ అధి నేతకు మరో షాక్‌.. తెర మీదకు ఫైబర్‌ నెట్‌ స్కాం

అమరావతి, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది. గతంలో సీఐడి దర్యాప్తు చేపట్టిన ఫైబర్‌ నె ట్‌ స్కాం కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ కేసులనూ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించిన సీఐడి అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని అభియోగాలు మోపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరా సాప్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారనేది చంద్రబాబుపై ప్రధాన ఆరోపణ. .

దీంతో ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఫైబర్‌ నెట్‌ కేసులో అరెస్టు చేసేందుకు సీఐడి సిద్ధమవుతోంది. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. అటు స్కిల్‌ కేసులో రిమండ్‌లో ఉంటుండగానే చంద్రబాబుపై సీఐడి అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం కేసులో అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

- Advertisement -

అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసులోనే చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా ఈనెల 21కి వాయిదా పడింది. అయితే చంద్రబాబును టార్గెట్‌ చేసిన సీఐడి ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు తెర మీదకు తీసుకువస్తూ తాజాగా పీటీ వారెంట్‌ దాఖలు చేయగా విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు. ఫైబర్‌ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడు ఏ1గా సీఐడి పేర్కొంది.

2019లోనే కేసు నమోదు..

వైసీపీ అధికారంలోకి రాగానే ఫైబర్‌ నెట్‌పై సీఐడి దృష్టి సారించింది. దర్యాప్తు షురూ చేసిన మీదట సీఐడీ చేస్తున్న ఆరోపణల ప్రకారం.. ఫైబర్‌ నెట్‌ స్కాంలో రూ.115 కోట్ల నిధులు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించి 2019లోనే 19 మందిపై కేసు నమోదు చేసి ఏ1గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ 2 మాజీ ఎండీ సాంబశివరావులను పేర్కొంది. వేమూరి హరిప్రసాద్‌కు చంద్రబాబు అత్యంత సన్నిహితుడైనందున టెర్రా సాఫ్ట్‌ టెండర్లు అతనికి కట్టబెట్టేందుకు అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సీఐడి పీటీ వారెంట్‌ పిటిషన్‌ నెంబర్‌ 2913/2023లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది.

దొడ్డిదారిలో టెండర్లు..

తెలుగుదేశం ప్రభుత్వంలో టెర్రా సాఫ్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్టుకు సంబంధించి దొడ్డి దారిలో టెండర్లు దక్కినట్లు సీఐడి ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించినట్లు తేల్చింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న సదరు కంపెనీకి టెండర్‌ దక్కేలా మేమూరి హరిప్రసాద్‌ లాబీయింగ్‌ చేశారని, ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ.115 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ ఆరోపించింది.

బ్లాక్‌ లిస్ట్‌లో టెర్రా సాఫ్ట్‌..

ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకోవడానికి ముందు సదరు టెర్రా సాఫ్ట్‌ కంపెనీ బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నట్లు సీఐడి దర్యాప్తులో తేలింది. అంతకుముందు రేషన్‌ షాపుల్లో వినియోగించే ఈ పోస్‌ మిషన్లు కాంట్రాక్ట్‌ను సివిల్‌ సప్లైస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ కంపెనీకే అప్పగించింది. కాగా నాసిరకం ఈ-పోస్‌ మిషన్లు పంపిణీ చేసినందుకు టీడీపీ ప్రభుత్వం టెర్రాసాప్ట్‌nను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. రెండు నెలల తర్వాత ఫైబర్‌ నెట్‌ వ్యవహారంలో సదరు కంపెనీని చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించి హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీతో కలిపి టెర్రాసాప్ట్‌కు ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టింది.

ఆ తర్వాత పరిణామాల్లో నిబంధనలకు విరుద్ధంగా టెర్రా సాఫ్ట్‌ కంపెనీ హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీని కాంట్రాక్ట్‌ నుంచి తొలిగించింది. ఇదే విషయాన్ని హిమాచల్‌ సంస్ధ ప్రతినిధి అనిల్‌ జైన్‌ వెల్లడించినట్లు సీఐడి ధృవీకరించింది. ఇక టెర్రా సాఫ్ట్‌ కంపెనీ రూ.115 కోట్లతో నాసిరకం సామాగ్రిని కొనుగోలు చేసి ఫైబర్‌ నెట్‌కు సరఫరా చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదంతా చంద్రబాబు ప్రమేయంతోనే జరిగిందని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్టు చేసేందుకు సీఐడి పీటీ వారెంట్‌ దాఖలు చేసింది.

పీటీ వారెంట్‌ ఇస్తే..?

ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను ఏసీబి కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ కోర్టు కనుక అనుమతి ఇస్తే వెంటనే సీఐడి రాజమండ్రి వెళ్ళి జైలులో ఉన్న చంద్రబాబును ఫైబర్‌ స్కాం కేసులో అరెస్టు చేసి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరుస్తుంది. ఒకవేళ ఈ కేసులో కూడా రిమాండు విధిస్తే తిరిగి జైలుకు తరలిస్తారు. ఇప్పుడున్న స్కిల్‌ కేసుతోపాటు ఫైబర్‌ నెట్‌ కేసులో కూడా చంద్రబాబు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్‌ 269 సీఆర్‌పీసీ కింద ప్రిజనర్‌ ఇన్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌ ప్రకారం ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement