హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : దేశానికి వెన్ను దన్ను రైతన్నే కావడంతో ఈ ఏడాది రాజకీయమంతా వ్యవసాయరంగం చుట్టే తిరుగబోతోంది. ఈ రంగానికి మరింత మేలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు రాష్ట్రంలో అధికారం కోసం ఆరాటపడుతున్న మరో రెండు జాతీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఆ దిశగా పావులు కదుపుతూ ఎవరికి వారు రైతులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, విపక్షాల మైండ్ బ్లాకయ్యేలా తెలంగాణ ముఖ్యమంత్రి మరో విశిష్ట పథకానికి నాంధి పలుకబోతున్నారు. ”కేసీఆర్ పెన్షన్” పేరుతో దేశం దృష్టిని మళ్ళించే సెన్సేషనల్ స్కీమ్ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారాయన.
వ్యవసాయ భూమి పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న రైతుబందు పథకం లెక్కల ప్రకారం 68 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ది పైచేయిగా నిలుస్తోంది. ఆదినుంచీ రైతు సంక్షేమమే అజెండాగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఆయన దేశం గర్వించదగిన అనేక కొత్త పథకాలు, కార్యక్రమాలు అమలుచేసి ఆదరాభిమానాలు పొందారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత చేపపిల్లలు, సబ్సిడీ గొర్రెలు, రుణమాపీ, వ్యవసాయ క్షేత్రాలకు సాంకేతిక పరిజ్ఞానం, కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథతో ఆయకట్టు స్థిరీకరణ, కొరతలేని సబ్సిడీ ఎరువులు, సకాలంలో విస్తనాల సరఫరా తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఈ అభివృద్ధి దేశ రాజకీయాల్లో ఆయనకు తిరుగులేని ఆయుధంగా మారుతోంది.
రాష్ట్రంలో సుమారు 68 లక్షల రైతు కుటుంబాలు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయి. కోటిన్నర దాటిన ఓటర్లు బీఆర్‌ఎస్ గల్లపెట్టెలో ఉన్నాయని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్ళలోనే కాదు, భవిష్యత్తులోనూ రైతు రాజ్యమే కేసీఆర్ ఎన్నికల నినాదం అన్నది వాస్తవం. బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అజెండాలోనూ వ్యవ’సాయమే’ కీ రోల్ కావడంతో ఆ ఒరవడిని మరింత బలపరుచుకునేందుకు ఆయన కొత్త వ్యూహంతో ఉన్నారు. దేశం అబ్బురపోయే మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తారని కేసీఆర్ అనుచరవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిష్టను మరింతగా పెంచే ఓ స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ”దేశమే అబ్బురపడే, ఆశ్చర్యపడే, అడ్డం పడే స్కీమ్ ఒకటు-ంది”.. అది ప్రకటిస్తే ప్రతిపక్షాలకు ఇక నూకలు చెల్లినట్లే.. అంటూ దాదాపు రెండున్నరేండ్ల క్రితం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సందర్భంగా బడ్జెట్‌లో అలాంటి స్కీమ్ ఉంటు-ందని చాలా మంది భావించారు. కానీ, సాదాసీదా బడ్జెట్‌గానే మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు.
కానీ, జగమెరిగిన నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానస పుత్రిక ప్రకటన ఎప్పుడనే ఆశలు అందరిలోనూ మొదలయ్యయి. ఆ స్కీం ఎలా ఉండబోతోంది.. ఏఏ వర్గాలకు లబ్ధి చేకూరుస్తుంది.. అనే అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ అది రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు, సామాజికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పరిధి దాటి జాతీయ స్థాయికి పార్టీని విస్తరింపజేస్తున్న కేసీఆర్ ”అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అనే నినాదాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బురపడే స్కీమ్ రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించినదే అయి ఉంటు-ందనే అంచనాలకు బలం చేకూరుతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాన్ని ప్రకటించాలన్న ఆలోచన ఉండొచ్చని, అందుకే తాజా బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేదనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. నిజానికి బడ్జెట్‌లో పేర్కొనని 9 ప్రత్యేక కార్యక్రమాలకు నిధులను కేటాయించిన సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్ మరో మానసపుత్రిక వచ్చే ఎన్నికల్లో ఆవిష్కృతమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుబంధు స్కీంను ప్రస్తావిస్తున్నారు. ఈ స్కీమ్‌ను బడ్జెట్‌లో పెట్టలేదని, అసెంబ్లీని రద్దు చేసే సందర్భంగా సీఎం ఆకస్మికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే తరహాలో ప్రస్తుతం ముందస్తుకు వెళితే, ఎన్నికల ముందే కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అంతర్గత కసరత్తు పూర్తి
సాధారణంగా అయితే, ఈసారి డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ దిశగా సిద్దమై, ఇప్పటికే అంతర్గత కసరత్తు పూర్తిచేసుకున్న కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించేలా విశిష్ట పథకాన్ని ప్రకటించడానికే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచి సంచలనంగా ప్రకటించాలన్న ఉద్దేశంతోనే బడ్జెట్‌లో పెట్టలేదనే వాదన కూడా వినిపిస్తోంది. 2014లో కేసీఆర్ మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టినపుడు రైతులందరికీ ఉచితంగా యూరియా, ఎరువులు తదితరాలను ఇవ్వనున్నట్టు- ప్రకటించారు. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చే సమయానికి ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇప్పటికీ అది అమలుకు నోచుకోని హామీగానే ఉండిపోయిందన్న రాజకీయ విమర్శలున్నాయి.
విశిష్టతను చాటుకోవడమే కేసీఆర్ లక్ష్యం
కేసీఆర్ ప్రకటించబోయే కొత్త స్కీమ్ కారణంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారమేమీ పడదని, 25 లక్షల టన్నులను ఉచితంగా ఇవ్వడానికి ఇబ్బంది కూడా ఏమీ లేదని స్వయంగా సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌తో ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ- కావాలనుకుంటు-న్న కేసీఆర్, రైతులకు పింఛను ఇవ్వడంపై కసరత్తు చేసినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు, కొందరు పార్టీ నేతల ద్వారా సమాచారం అందింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కడాలేని ఈ విశిష్ట పథకాన్ని తెలంగాణలో ప్రరంభించాలని కేసీఆర్ సంకల్పించినట్లు సమాచారం. ఈ పథకాన్ని అమలు చేసి అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు- తెలుస్తోంది.
ఇప్పుడున్న పథకాలన్నీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమే..
ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, నీటి తీరువా రద్దు, 24 గంటలూ ఉచితంగా వ్యవసాయ విద్యుత్ తదితరాలను తెలంగాణ అమలు చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రే కామెంట్ చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి రైతులకు పింఛన్ లాంటి పథకాన్ని ప్రకటించి వెంటనే అమల్లోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు- చర్చలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్ల్రో విస్తృతంగా ప్రచారం చేసుకుని సంస్థాగతంగా బలపడడానికి, ఇక్కడి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీఆర్‌ఎస్‌కు ఇలాంటి సెన్సేషనల్ స్కీమ్ ఉపయోగపడుతుందనేది ఆ పార్టీ భావన.
రైతుల్లో నిరాశకు నో ఛాన్స్
ఇప్పుడు బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పథకాలు లేవని నిరాశపడిన ప్రజలు ముఖ్యంగా రైతులు, త్వరలో కేసీఆర్ ప్రకటించబోయే సెన్సేషనల్ స్కీమ్‌ను చూసిన తర్వాత మనసు మార్చుకుంటారన్న విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉన్నందున బడ్జెట్‌లో పెడితే అప్పటి వరకు ఇది పాత స్కీమ్ అయిపోతుందని, ప్రజలు మర్చిపోతారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ఆశించిన లక్ష్యం, రాజకీయ ప్రయోజనం నెరవేరేందుకు.. ఎన్నికల సమయమే సరైనదిగా ఉంటు-ందనే అభిప్రాయమూ లేకపోలేదు. ఆ సెన్సేషనల్ స్కీమ్ ఏమిటనేది ఇప్పటికి పార్టీ వర్గాల్లోనూ సస్పెన్స్‌గానే ఉన్నది.
ముక్కోణపు పోటీలో కేసీఆర్ వ్యూహానిదే పైచేయి..
రాష్ట్రంలో రాజకీయపరంగా ఉన్న ముక్కోణపు పోటీ-లో బీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. గతం మాదిరి భారీ విజయాన్ని సొంత చేసుకుంటే జాతీయ పార్టీగా ఖ్యాతి దక్కుతుందని పార్టీ విశ్వసిస్తున్నది. అలాంటి విజయం కోసం ఎన్నికల సందర్భంగానే సరికొత్త స్కీమ్‌ను ప్రకటించడానికి పార్టీ ఆసక్తి చూపుతున్నట్టు- సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయానికి రైతుబంధు కారణమైనట్లు-గానే, ఈ సారీ అదే ఫార్ములాను బీఆర్‌ఎస్ అనుసరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీ ఏదైనా, పాలించే నాయకుడు ఎవరైనా అన్నదాతలకు మేలు జరుగడం శుభ పరిణామని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏజెన్సీలో హైఫై హైవే
రాజమండ్రి – అల్లూరి – విజయనగరం జిల్లాల మీదుగా కొత్త జాతీయ రహదారి
శరవేగంగా ఏజెన్సీ అందాల హైవే నిర్మాణ పనులు
పర్యాటక, రవాణా రంగాలకు ఊతమిచ్చేలా నిర్మాణం
370 కిమీ.. రూ. 1575 కోట్లతో నిర్మాణం
ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు
అమరావతి, ఆంధ్రప్రభ: ఏజెన్సీ ప్రాంతంలో మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం పట్టాలెెక్కింది. ప్రకృతి అందాల మధ్య మూడు జిల్లాలను కలుపుతూ, రెండు వరుసల రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 370 కిమీ మేర ఈ రెండు వరుసల కొత్త జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1575 కోట్లను మంజూరు చేయడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా భూ సేకరణ జరుగుతున్నప్పటికీ రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 74 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో రహదారిని నిర్మిస్తున్నారు. దీనిలో 34 అడుగుల మేర తారురోడ్డు నిర్మాణం సాగుతుండగా ఆ రోడ్డుకు రెండు వైపులా మరో 20 అడుగుల మేర విస్తీర్ణంలో మట్టిరోడ్డును నిర్మిస్తూ విస్తరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ కల్వర్టులు, వంతెనలు అవసరమో వాటిని ఇప్పటికే గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆ మేరకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ అందాల నడుమ నిర్మాణం అవుతున్న ఈ రహదారి రాష్ట్ర పర్యాటక రంగానికి ఎంతో ఊతాన్నిచ్చేలా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ రహదారి నిర్మాణానికి 2018 లోనే ప్రతిపాదనలు చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఇప్పుడు కేంద్రం పనులకు ఆమోదం తెలపడంతో పాటు పాటు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి. మొత్తం 370 కిమీ మేర నిర్మిస్తున్న ఈ కొత్త రహదారిని మొత్తం ఆరు బ్లాక్‌లుగా ఎన్‌హెచ్‌ఏఐ అధి కారులు విభజించారు. రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకూ 44 కిమీల నిర్మాణాన్ని ఒక బ్లాక్‌గా, అక్కడ నుంచి కాకరపాడు వరకూ 74 కిమీల దూరాన్ని మరో బ్లాక్‌గా కాకరపాడు నుంచి పాడేరు 133 కిమీల రహదారిని ఇంకొక బ్లాక్‌గా విభజించారు. అలాగే పాడేరు నుంచి విజయనగరం వరకు ఉన్న 119 కిమీల రహదారి నిర్మాణాన్ని మరో మూడు బ్లాక్‌లుగా నిర్మాణాన్ని విభజించి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
కొత్త హైవేతో మెరుగైన రవాణా వ్యవస్థ
తాజాగా నిర్మించనున్న ఈ హైవేతో ఏజెన్సీ ప్రాంత రవాణా వ్యవస్ధ మరింత మెరుగుకానుంది. అంతేకాకుండా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి ఏజెన్సీకి మరింత సులువైన రవాణా వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. ఇంకోవైపు పర్యాటకంగా కూడా ఈ కొత్త హైవే నిలువనుంది. వివిధ రాష్ట్రాల నుంచి లంబసింగి, పాడేరు, అరకు తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వసూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ హైవే వారిని మరింత ఆకట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బ్లాక్‌వన్ పనులు మొదలు కావడంతో పాటు మిగిలిన ప్రాంతాలలో నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సన్నాహాలు చేస్తోంది.