హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై ‘హైడ్రా’ చర్యల నుంచి కోలుకోక ముందే.. రాష్ట్రంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనేక మంది రాజకీయ నేతల మూలాలు కదిలే ఈ వ్యవహారంపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) తాజాగా ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించింది. భారీగా సీఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్ మాల్ జరిగినట్లు నిజాలు నిగ్గుతేలడంతో బాధ్యులైన వ్యక్తులు, ఆస్ప్రత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నారు.
సీఐడీ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి రావడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న రాజకీయ నేతల్లో భయాందోళన మొదలైంది. అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రుల జాబితా విడుదల కావడంతో ఆయా యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చెంతకు దర్యాప్తు నివేదికతో చర్యలు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 ఆస్పత్రుల బండారం బట్టబయలైంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కుంభకోణం వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నకిలీ బిల్లులను సమర్పించడం ద్వారా సీఎంఆర్‌ఎఫ్ నుంచి భారీగా నిధులను విత్ డ్రా చేసిన ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎంఆర్‌ఎఫ్ కింద పేషెంట్లకు వైద్యం చేసినట్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు నకిలీ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వాటి ద్వారా నిధులను విడుదల చేయించుకున్నాయి.
ఈ వ్యవహారంపై సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ కుంభకోణంలో కొందరు బడా నాయకులు సైతం ఉన్నట్లు తేలింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సీఐడీకి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులపై ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధి జాబితా నుంచి తొలగించారు.
హైదరాబాద్‌లో- అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, జననీ ఆసుపత్రి, హిరణ్య ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, శ్రీ రక్ష ఆసుపత్రి, ఎంఎంఎస్ ఆసుపత్రి, ఏడీఆర్‌ఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి తిరుమల ఆసుపత్రి ఉన్నాయి.
ఖమ్మంలో- శ్రీకర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైష్ణవి ఆసుపత్రి, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి, ఆరెంజ్ ఉన్నాయి.
నల్గొండలో – నవీనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మిర్యాలగూడ, మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మిర్యాలగూడ, అమ్మ ఆసుపత్రి ఉన్నాయి. కరీంనగర్‌లో సప్తగిరి ఆసుపత్రి జమ్మికుంట, శ్రీసాయి ఆసుపత్రి పెద్దపల్లి, వరంగల్‌లో రోహిణి మెడికేర్ హన్మకొండ, మహబూబాబాద్‌లో – శ్రీ సంజీవిని, సిద్ధార్థ్ ఆసుపత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ట్వీట్ సంచలనంగా మారుతోంది.
నకిలీ బిల్లులతో నిధులు స్వాహా!
రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సీఐడీ గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్ కు ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు ఎఫ్‌ఐఆర్ లో సీఐడీ పేర్కొంది.
నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సీఐడీ తన ఎఫ్‌ఐఆర్ లో పేర్కొంది. సచివాలయంలోని సీఎంఎఫ్‌ఆర్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ విచారణ చెపట్టగా పేదల డబ్బులతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది.
యాజమాన్యాల పాత్రపై ఆరా..
వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగులు పేరుతో మోసానికి పార్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా? లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్ కు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
హరీశ్ రావు మాజీ సిబ్బంది అరెస్ట్..
సీఎంఆర్ ఎఫ్ చెక్కుల దుర్వినియోగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఈ కేసులో గతమంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వద్ద టేడా ఎంట్రీ ఆపరటర్‌గా పని చేసే వ్యక్తిపై సైతం కేసు నమోదు అయింది.
స్కాంలో లోకల్ లీడర్ల పాత్ర..
నకిలీ బిల్లులు పెట్టి సీఎంఆర్‌ఎఫ్ నిధులను మింగేయాలనుకున్న వారికి తెలంగాణ సీఐడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్‌లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు.