హైదరాబాద్, ఆంధ్రప్రభ : కొత్తగా అప్పులకు ఆర్భీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బాండ్ల వేలంలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననున్నది. ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో రూ.2000 సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. రూ.1000 కోట్ల విలువైన బాండ్లను 16 ఏళ్ల కాలానికి, మరో రూ.1000 విలువైన బాండ్లను 19 సంవత్సరాల కాలానికి జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను ఆర్‌బీఐ 4న వేలం వేయనుంది. వేలంలో బాండ్ల విక్రయం తర్వాత రూ.2000 మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.8000 కోట్లను అప్పుగా తీసుకొంది. తాజాగా రూ.2000 కోట్లతో ఆ మొత్తం రూ. 10వేల కోట్లకు చేరనుంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో సుమారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించే వడ్డీలు, కిస్తీలే తడిసిమోపెడయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పా-టైన తర్వాత ఇప్పటి వరకు అంటే.. డిసెంబరు నుంచి ఈ నెల 13 వరకు రూ.17,618 కోట్ల రుణాలు (బడ్జెట్, బడ్జెటేతర) చేసింది.
అయితే.. ఇదే వ్యవధిలో రూ.25,911 కోట్ల మేర (అప్పులు, వడ్డీలు) కిస్తీల పేరిట తిరిగి చెల్లించింది. కొత్తగా చేసిన అప్పుల కంటే సుమారు రూ.8 వేల కోట్లకు పైగా చెల్లింపులను ఎక్కువగా చేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రజలపై రుణ భారం తగ్గినట్లయిందని అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రేవంత్ సర్కారు సగటున రోజుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత సంక్షేమ నిధులను భారీగా వ్యయం చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ధిక శాఖపై భారం పడుతోంది. మొత్తంగా డిసెంబర్ 2023నుంచి ఏప్రిల్ 2024 నాటికి రూ.66,507 కోట్లు ఖర్చు చేసింది.
ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.22328కోట్లు, వడ్డీలు, అప్పుల రీ పేమెంట్లకు రూ.26,374కోట్లు, రైతు భరోసా రూ.5575కోట్లు, చేయూత రూ. 3840కోట్లు, మహాలక్ష్మి(ఆర్టీసీ) పథకానికి రూ.1125కోట్లు, గృహజ్యోతికి రూ.200కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.189కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ(మహాలక్ష్మి) రూ.80కోట్లు, విద్యుత్ సబ్సిడీ చెల్లింపు రూ.3924కోట్లు, బియ్యం సబ్సిడీ రూ.1147కోట్లు, రైతు బీమా రూ.734కోట్లు, డైట్ చార్జీలు రూ.418కోట్లు, మధ్యాహ్న భోజనం పథకానికి రూ.52కోట్లు, అంగన్‌వాడీ వేతనాలు రూ.69కోట్లు, హోంగార్డుల వేతనాలు రూ.186కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.267కోట్లు చెల్లింపులు చేసింది.