Sunday, November 17, 2024

TG | నగరంలో మరో రియల్‌ మోసం…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో మ‌రో రియల్‌ ఎస్టేట్‌ మోసం వెలుగుచూసింది. ఫ్రీ లాంచ్‌ పేరిట రూ.200 కోట్లు వసూలు చేసి చీటింగ్‌కు పాల్పడిన రియల్‌ సంస్థ యజమాని ఇంటి ఎదుట 450 మందిని బాధితులు ఆందోళన చేపట్టారు.

కొంపల్లిలో ఇళ్లు కట్టి ఇస్తామని భారతి బిల్డర్స్‌ ఫైనాన్షియర్‌ సునీల్‌ కుమార్‌ అహుజ ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో ఫ్రీ లాంచ్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు దాదాపు 450 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేశారు.

అయితే నాలుగేళ్లు కావస్తున్నా ఫ్రీ లాంచ్‌లో డబ్బులు చెల్లించిన వారికి ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేయలేదు. అదేవిధంగా పెద్ద ఎత్తున నగదు చెల్లించిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వలేదు. అదిగో… ఇదిగో అంటూ నాలుగు సంవత్సరాల నుంచి భారతి బిల్డర్స్‌ వారు తమను తిప్పుతూనే ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఫ్రీలాంచ్‌లో నగదు చెల్లించిన వారికి చెప్పకుండా భూమిని కుదువ పెట్టి మోసం చేశాడని బాధితులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో, అలాగే సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఏలాంటి కేసు నమోదు చేయలేదని బాధి తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఈనేపథ్యంలో బంజారాహిల్స్‌ లోటస్‌ పాండ్‌లోని కొంపల్లి వెంచర్‌ భారతి బిల్డర్స్‌ ఫైనాన్షియర్‌ సునీల్‌ కుమార్‌ అహుజ నివాసం వద్ద కొంపల్లి వెంచర్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. ఫ్రీలాంచ్‌ పేరిట 450 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి చీటింగ్‌కు పాల్పడిన సునీల్‌ కుమార్‌ అహుజాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement