Tuesday, November 26, 2024

TS | రాష్ట్రానికి మరో వానగండం.. మరోసారి భారీ వర్ష హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు మరో వానగండం పొంచి ఉంది. పది రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలు తెరిపి ఇచ్చి రెండు రోజులు గడిచాయో లేదో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు వరణుడు మరోమారు సిద్ధమయ్యాడు. వరదల తాకిడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరద పోటు కు నదులు, వాగులు ఉప్పొంగి ఊళ్లు, చేలు , ఇళ్లు అన్న తేడా లేకుండా ముంచెత్తాయి. దీంతో వందలాది గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలు నీట మునిగాయి. చాలా చోట్ల ఆస్థి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఆ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితులు మరోసారి భారీ వర్ష హెచ్చరిక రావడంతో బెంబెళెత్తిపోతున్నారు.

రానున్న 24 గంటల్లో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో మంగళవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పశ్చిమబెంగాల్‌ , ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడడంతోపాటు రాష్ట్రంలో పశ్చిమదిశ నుంచి గాలులు వీస్తున్నాయని, దీంతోపాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

- Advertisement -

పలుచోట్ల వర్షాలు…

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 11 మి.మీలు, హైదరాబాద్లో 3.9, జగిత్యాలలో 15.9, కుమరం భీం ఆసీఫాబాద్‌లో 4.2, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 24.మీమీలు, మంచిర్యాలలో 8.8 మి.మీలు, మెదక్‌లో 5.8 మి.మీలు, ములుగులో 3.6 మి.మీలు, నిర్మల్‌లో 24.2 మి.మీలు, సంగారెడ్డిలో 5.2 మి.మీలు, యాదాద్రి భువనగిరిలో 5.6 మీ.మీల వర్షం కురిసింది.

తడిసిముద్దయిన భాగ్యనగరం…

హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. దాదాపు మూడు రోజులపాటు- తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టు-ండి హైదరాబాద్‌ మహానగరంపై మరోసారి ఉరిమాడు. సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. దాదాపు మూడుసార్లు తాపకు 20 నిమిషాలపాటు జోరుగా వర్షం కురవడంతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అశోక్‌నగర్‌, లక్డీకపూల్‌తోపాటు- పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రామంతపూర్‌, అంబర్‌ పేట్‌, మలక్‌పేట్‌, హిమాయత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది.

అంతేకాకుండా అమీర్‌ పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌ నగర్‌ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. సచివాలయం ప్రాంతంలో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఆఫీసులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో వర్షం పడడంతో ఉద్యోగులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరానికి భారీ వర్షసూచన ఉండడంతో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ అయింది. అన్ని సర్కిళ్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలు కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 040- 21111111, 9000113667కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement