న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అవినీతి పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ క్విట్ ఇండియా కూటమి ఉద్యమం చేపడుతోందని, అది రేపు (బుదవారం) ప్రారంభం కానుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన పార్లమెంట్ మీడియా పాయింట్ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.
బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బంధం ఉందని అన్నారు. ప్రభుత్వ సొమ్ము రూ. 45 కోట్లతో కేజ్రీవాల్ నివాసానికి విలాసాలు, సౌకర్యాలు కల్పించుకున్నారని విమర్శించారు. ఆస్తులు, ఇతర అంశాలను తారుమారు చేయడానికి మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. అవినీతి పార్టీకి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారంటే కారణమేంటో తెలంగాణ ప్రజలు గుర్తించాలని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక్కటేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను చూడలేక ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం పెట్టాయని చెప్పారు. తాము చర్చకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉంటే సభ నుంచి పారిపోతున్నారని దుయ్యబట్టారు. హోంమంత్రి అమిత్ షా కూడా మణిపూర్ అంశంపై చర్చ సిద్ధమని చెప్పినా సరే అవిశ్వాసం పెట్టారన్న లక్ష్మణ్, చర్చల ద్వారా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతిపక్షాల అవినీతిని ప్రజలకు తెలిసేలా చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఇండియా కూటమికి బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.