న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డా. సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే అంశంపై తొలుత ట్రయల్ కోర్టును ఆమె ఆశ్రయించగా.. దర్యాప్తును జూన్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున తాము పర్యవేక్షించలేమంటూ సునీత పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది.
ట్రయల్ కోర్టు నిర్ణయంపై ఆమె నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టుకు ఈనెల 20 నుంచి సెలవుల కారణంగా పర్యవేక్షణపై అంత త్వరగా ఆదేశాలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.