అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయడంలోనూ, వరదలకు సంబంధించి అత్యవసర నిర్మాణ పనులను చేపట్టడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అంతే వేగంగా పనులను కూడా పూర్తి చేసి, తమ సత్తా చాటుకుంటోంది. ఇప్పటికే కాంక్రీట్ నిర్మాణ పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఇంజనీరింగ్ బృందం తాజాగా గోదావరి వరద నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచే పనులను 48 గంటల్లో పూర్తి చేసి, మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. గోదావరికి భారీ వరద పోటెత్తడంతో ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎగువ కాఫర్ డ్యామ్ రెండున్నర కి.మీ పొడవునా ఒక మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచే పనులు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి. ఆ పనులను ఈ నెల 17 కల్లా పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టు-కునేలా ఉండగా.. దీనికి మించి వరద నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి నీరు దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలోపెట్టు-కొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎగువ కాఫర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేపట్టారు. 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేసి ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్లకు పెంచారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని..
ప్రతి ఏటా గోదావరికి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా గడిచిన మూడేళ్లుగా ఒకే సీజన్లో ఏడెనిమిది సార్లు గోదావరికి వరద వస్తోంది. గతంలో 1986లో ఒకసారి అత్యంత భారీ వరద వచ్చింది. అప్పట్లో 75.6 అడుగుల స్థాయికి భద్రాచలం వద్ద వరద వచ్చింది. అదే ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం ఉన్న ప్రవాహాలు ఆధారంగా రెండో అతి పెద్ద వరదగా పరిగణించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా పోలవరానికి 26 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరకు ఎంతైనా వరద రావచ్చని అధికారులు అంచనా వేశారు. పోలవరం పరిస్థితిపై, ఎగువ కాఫర్ డ్యాం అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల జల వనరులశాఖ అధికారులను వివరాలు అడిగారు. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదనకు సీఎం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.