ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే టాటా మోటార్స్ అగ్రభాగనా ఉంది. కంపెనీకి చెందిన నెక్సాన్, టియాగో, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. తాజాగా ఎంట్రీ లెవల్ ఎస్యూవీ పంచ్ మోడల్లోనూ విద్యుత్ వెర్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. పంచ్ ఈవీని కంపెనీలు రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది.
పెట్రోల్ వెర్షన్ పంచ్‌తో పోల్చితే కంపెనీ ఈవీ మోడల్ డిజైన్‌లో పలు మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెస్ట్ రన్లో ఉన్న డిజైన్లోనూ తుది లాంచింగ్ సమయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఈ వర్గాలు తెలిపాయి. ఇంటీరియర్‌లోనూ పలు మార్పులు చేస్తున్నారు. 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసుకు వస్తున్నారు.
పంచ్ ధరను 12 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ఇటివలే ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా కొత్త బ్రాండ్ లోగోనూ ఆవిష్కరించింది. రానున్న సంవత్సరాల్లో టాటా మోటార్స్ పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్లను మార్కెట్లోకి తీసుకు రానుందని ఇటీవల కంపెనీ ఎండీ శైలేష్ చంద్ర ప్రకటించారు.
కంపెనీ ఇప్పటికే కర్వ్, సియారా విద్యుత్ కార్లను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు హరియర్లోనూ విద్యుత్ వెర్షన్‌ను తీసుకు వచ్చే యోచనలో కంపెనీ ఉంది. దేశంలో క్రమంగా విద్యుత్ కార్లకు డిమాండ్ పెరగడంతో అత్యధిక మార్కెట్ వాటాను సాధించడంపై టాటా మోటార్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసింది.