హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశానికి రెండో రాజధాని స్థాయికి అప్‌గ్రేడ్ అయిన గ్రేటర్ హైదరాబాద్‌కు అనుబంధంగా ”మరో మహా నగరం” నిర్మితం కాబోతోంది. ఐటీ, ఇండస్ట్రియల్, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలవడంతో పాటు బెస్ట్ లివింగ్ సిటీల్లో అగ్ర భాగాన నిలిచిన మన సౌభాగ్య నగరం వచ్చే ఐదేళ్లలో రెండింతలు విస్తరించనుంది. 84 గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అడ్డుకట్టగా మారిన 111 జీవోను పూర్తిగా ఎత్తివేసిన ప్రభుత్వం ఆ పరిధిలోని దాదాపు లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ సిటీ నిర్మాణానికి భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పూర్తిగా నగరం నడిబొడ్డున కానున్నది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడున్న హైదరాబాద్ నగరం విస్తీర్ణం మొత్తం 650 చదరపు కిలోమీటర్లుగా ఉంది. అనుబంధంగా రానున్న డ్రీమ్ సిటీ విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి కానుంది. నిత్యం రద్దీతో ఉండే మహానగరాన్ని వదిలి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని అప్పర్ స్టేజ్‌లో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ అటువైపే దృష్టి కేంద్రీకరించాయి. గత ఏడాది 111 జీవో రద్దు ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే వేలాది ఎకరాలు కొనిపెట్టిన టాప్ 20 స్థిరాస్తి నిర్మాణ సంస్థలు ఇప్పుడు నిర్మాణ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో స్థానిక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంగా వారి కల కేసీఆర్‌తో సాకారం కాబోతోంది.
ఈ అంశంపై గతంలోనే అసెంబ్లి వేదికగా సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 111 జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో… 84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటాయి. తమ ప్రాంతం ఇక అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతుంటే… పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలతో పాటు పలు పార్టీలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి. కేవలం రియల్ దందా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ… హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. ఇదిలా ఉన్నప్పటికీ… హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. నగరంలో కూడా అపార్ట్‌మెంట్ ధరలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ఫలితంగా 84 గ్రామాలకు మ#హర్దశ రాబోతుందని అంటున్నారు. అయితే జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న నేపథ్యం…? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? వంటి అంశాలను చూస్తే…..
1996లో వెలువడిన 111 జీవో..
నిజాం పాలకుల సమయంలో జంట జలాశయాలు.. ఉస్మాన్ సాగర్, హమాయత్ సాగర్లను నిర్మించారు. హైదరాబాద్ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీరు. అవి లేకుంటే.. హైదరాబాద్ నగరానికి కష్టంగా ఉండేదేమో. ఇలాంటి ముఖ్యమైన జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో.. 1996లో 111 జీవోను తెచ్చింది అప్పటి ప్రభుత్వం. జలాశయాల్లో నీటి కలుషితం చేయకుండా ఉండటం దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి 1994లో జీవో 192 తీసుకొచ్చారు. గండిపేట చెరువు దగ్గరలో ఓ రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయడంతో.. జీవోను తెచ్చారు. అయితే.. మళ్లి 1996లో సవరించి జీవో 111గా ఛేంజ్ చేశారు. అలా జీవోలో అనేక నిబంధనలు పెట్టారు.
ఆ జీవోలో ఏం ఉందంటే..
జీవో ప్రకారంగా చూసుకుంటే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్‌గా ఉంటుంది. ఆ చెరువుల పరిధిలోని లేఅవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. గ్రామ కంఠాన్ని పక్కనపెడితే.. మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై అబ్జర్వేషన్ ఉండాలి. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలకు చెందిన 84 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం మొత్తం విస్తీర్ణం ఎంతంటే.. 538 చదరపు కిలోమీటర్లు. మరో హైదరాబాద్ అన్నమాట.
ఏయే మండలాల్లో ఏయే గ్రామాలు?
ఈ 84 గ్రామాల్లోని లక్షా32 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇంతటి భూమి భాగ్యనగరానికి దగ్గరలో ఉంది. కేవలం వ్యవసాయ కార్యకలాపాలకే కేటాయించాలని ఆదేశించడంతో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలు స్తంభించాయి. శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు దీని కిందకు వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాలు, షాబాద్ మండలం 2 గ్రామాలు, కొత్తూరు మండలం ఒక గ్రామం కూడా జీవో కిందకే వస్తాయి.
ఆ పల్లెల్లో భూముల ధరలకు రెక్కలు
జీవో ఎత్తివేయడంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతాయి. అంతకుముందు హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు పెరిగినా.. కూడా జీవో 111 అమలులో ఉంది కాబట్టి.. ఈ గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. భూములు కొనేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారు. జీవో వ్యతిరేక పోరాట సమితిని కూడా ఏర్పాటు చేశారు. మహానగరానికి దగ్గరలోనే ఈ భూములు ఉండటంతో.. ఇప్పుడు జీవో ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మించవచ్చనే.. అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
నిబంధనలు ఉన్నా.. ఆగని దందా!
అయితే ఎన్ని నిబంధనలు ఉన్నా.. దందా చేసేవారు.. ఆగలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బడాబాబులు.. ఇక్కడ భూములు కొని.. ఫామ్‌హౌసులు, విల్లాలు కట్టారు. ఇక పార్టీల ప్రచారాల్లోనూ.. దీనిపై తప్పకుండా హామీ ఉండేది. అధికారం వస్తే.. జీవో ఎత్తివేస్తామని చెప్పేవారు. నాణానికి రెండు వైపులు అన్నట్టుగా.. కొంతమంది స్థానికులు సైతం.. ఈ జీవో ఎప్పుడు ఎత్తివేస్తారా అని కూడా చూశారు. మరోవైపు కొంతమంది పర్యావరణ వేత్తలు.. జీవోను.. ఎత్తివేయొద్దని కోర్టుల చుట్టూ తిరిగారు. జీవో సంగతి పూర్తిగా తేల్చేయాలని ప్రభుత్వం అనుకుంది. అందులో భాగంగానే.. 2016లో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
అన్ని కోణాల్లో అధ్యయనం తర్వాతే ప్రభుత్వ నిర్ణయం
111 జీవో అర్థరహతం అనేది ప్రభుత్వ వాదన. ఈ జీవో పరిధిలో లక్షా32 వేల 600 ఎకరాల భూమిని గతంలో జంట జలాశయాల పరిరక్షణ కోసం ఇచ్చారని చెబుతోంది. అయితే హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని ప్రభుత్వం అంటోంది. వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని.. 111 జీవోకు అర్థం లేదంటోంది. విలువైన భూములు ఖాళీగా ఉంటున్నాయని వాదన. అందులో భాగంగానే.. జీవో 111పై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మూడో వంతు జనాభా రాజధానిలోనే..
తెలంగాణలో పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో మూడవ వంతు రాజధానిలోనే నివాసం ఉంటోంది. 1950 ప్రాంతంలో హైదరాబాద్ జనాభా సుమారు 10 లక్షలకు పైగా ఉండగా.. 1975 నాటికి ఆ సంఖ్య 20 లక్షలు దాటేసింది. ఆ తర్వాత మరో పదిహేనేళ్లలో (1990 నాటికి) సుమారు 40 లక్షలకు పైగా పెరిగింది. ఆ తర్వాత మరో 20 ఏళ్లలో (2010 సంవత్సరం నాటికి) 80 లక్షలకు చేరుకుంది. ప్రస్తుత సంవత్సరానికి జనాభా సంఖ్య కోటి దాటేసింది.
ఓఆర్‌ఆర్ పరిధిలో 1000 కి.మీ. భాగ్యనగరం
ఒకప్పుడు భాగ్యనగరం అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఏర్పాటుతో ఆ పరిధి పెరిగి.. 650 చదరపు కిలోమీటర్లకు నగరం విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ఉపాధి రీత్యా ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది నగరానికి వలస వచ్చి.. ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య వార్షికంగా 4.07 లక్షలు కాగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య 88,216గా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం అంచనా వేసింది.
అవకాశాలు ఎన్నో.. సవాళ్లు కూడా అన్నే!
ఇదిలా ఉండగా.. రోజురోజుకు పెరుగుతోన్న జనాభాతో నిత్యం సవాళ్లతో పాటు అవకాశాలూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కోటి దాటేసిన హైదరాబాద్ జనాభాలో 25 శాతం వరకు 14 ఏళ్లలోపు పిల్లలు ఉండగా.. 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న వారి సంఖ్య 60 శాతానికి పైగానే ఉంది. వీరంతా పని చేసే జనాభా. వీరందరిలో నైపుణ్యాలను పెంపొందిస్తే రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో.. తద్వారా దేశాభివృద్ధిలో కీలకంగా మారతారని చెబుతున్నారు. ఈ అవకాశాలతో పాటు జనాభాకు తగిన గృహవసతి, నీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పన, ప్రజా రవాణా వంటి సవాళ్లను అధిగమించాలంటే ముందుచూపుతో పాటు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం
మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలోనూ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. మొత్తం 97 నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించగా.. న్యూయార్క్ నగరం 3.40 లక్షల మిలియనీర్లతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు 65వ స్థానం లభించింది. భాగ్యనగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు (దాదాపు రూ.8.2 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవారు) ఉన్నట్లు ఓ సంస్థ తన అధ్యయనంలో తెలిపింది.