Tuesday, November 19, 2024

High Alert | 24 గంటల్లో మరో అల్పపీడనం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండో రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ-వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న వాయవ్యం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మధ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, పశ్చిమ భారతదేశంలోని కొంకణ్‌, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్‌ ప్రాంతాలు, గుజరాత్‌లలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంముందని తెలిపింది.

దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు, తూర్పు భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

వర్షాకాలం వచ్చినప్పటి నుంచి గురువారం రోజు అత్యధికంగా 34.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కురిసింది. కుమురం భీం, మంచిర్యాల, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో ఇందల్‌ వాయిలో అత్యధికంగా 105.6 మి.మీ అత్యధిక వర్షం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 188.3 మి.మీ వరకు వర్షం పడింది. హైదారాబాద్‌ వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 1991 నుంచి 2020 వరకు 30 ఏళ్లలో జులై నెల సగటు వర్షపాతం 162 మి.మీ లుగా ఉంది. మియాపూర్‌లో 99.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జులై నెలలో అద్యధిక వర్షపాతం పదకొండేళ్ల క్రితం 2012లో 115.1 మి.మీ లుగా నమోదైంది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత అత్యధికంగా నమోదు అయింది.

రాబోయే మూడ్రోజుల పాటు జోరు వానలు

రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.

గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు..

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సరాసరి 32.5 మి.మి
  • మహబూబాబాద్‌ జిల్లాలో సగటున 60.1 మి.మి
  • వరంగల్‌ జిల్లాలో సగటున 73.2 మి.మి.వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌.
  • హనుమకొండ జిల్లాలో సగటున 29 మి.మి
  • జనగామ జిల్లాలో సగటున 91 మి.మి, -జనగామ జిల్లాలోని జాఫర్‌ ఘడ్‌ వద్ద 186.3 మి.మి వర్షపాతం నమోదైంది.
  • ములుగు జిల్లాలో 43 మి.మి సగటు వర్షపాతం నమోదు. ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌.
  • భూపాలపల్లి జిల్లాకి నేడు రెడ్‌ అలెర్ట్‌.
  • ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 117. మీమీ వర్షపాతం నమోదు.
  • కొమురం భీం జిల్లా కౌటాల 96 మీమీ
  • నిర్మల్‌ జిల్లా కుభీర్‌ లో 81.5 మీమీ
  • మంచిర్యాల జిల్లా కొమ్మెర లో 43.3 మీమీ వర్షపాతం నమోదు.
Advertisement

తాజా వార్తలు

Advertisement