ఆంధ్రప్రభ, హైదరాబాద్: మరో భారీ నోటిఫికేషన్‌తో ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు మరో శుభవార్తను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఒకేసారి 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తూ గురువారం సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ నెల 23నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అనుమతులు జారీ చేసింది. 9 వైద్య కళాశాలల్లో 3897 పోస్టుల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఒక్కో కళాశాలకు 433 పోస్టుల చొప్పున రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, అసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.
తాజా గ్రూప్-4 ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 2701 పోస్టులు, రెవెన్యూశాఖలో 2077 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1862, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ అడిటర్ పోస్టులున్నాయి.
శాఖ ఖాళీలు
వ్యవసాయ 44
పశుసంవర్ధక 2
బీసీ సంక్షేమం 307
సివిల్ సప్లై 72
విద్యుత్ 2
అటవీ 23
ఆర్ధిక 255
జీఏడీ 5
వైద్యారోగ్య 338
ఉన్నతవిద్య 742
పరిశ్రమలు 7
హోంశాఖ 133
ఇరిగేషన్ 51
కార్మిక 128
మైనార్టీ సంక్షేమశాఖ 191
మున్సిపల్ పరిపాలన 2701
పంచాయతీరాజ్ 1245
ప్రణాళిక 2
రెవెన్యూ 2077
ఎస్సీ అభివృద్ధి 474
సెకండరీ విద్య 97
ఆర్ అండ్ బీ 20
గిరిజన సంక్షేమశాఖ 221
స్త్రీ, శిశు 18
యువజన సంక్షేమ శాఖ 13
మొత్తం 9168
ఈ నెలలో ఇక వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు పండుగ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80వేల ఖాళీలను గడువులోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్ధిక శాఖ అనుమతులతో అన్ని నియామక సంస్థలు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. డిసెంబర్ 8నుంచి పోలీస్ నియామక అర్హత అభ్యర్ధుల ఫిజికల్ టెస్టులు ప్రారంభం కానుండగా, త్వరలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌ను జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 60929 పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతులు జారీ చేయడంతో నోటిఫికేషన్ల జారీ దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోంది.
మిగిలిన 16,940 ఉద్యోగాలకు త్వరలో ఆర్ధిక శాఖ పరిపాలనా అనుమతులకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ మాసంలో గ్రూప్2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించగా, తాజాగా 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ ప్రక్రియకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.