బెంగళూరు: ఇస్రో మరో ఘన విజయం సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన కీలక ఘట్టం శనివారం ఫలించింది.
భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్1’ లక్ష్యం. ప్రయోగం విజయవంతం కావడంపై ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.