Friday, November 22, 2024

2025 నాటికి విశాఖలో మరో ఈఎస్‌ఐ.. రాజ్యసభలో వెల్లడించిన‌ కేంద్రమంత్రి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో 2025 నాటికి మరో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సంఘటిత రంగంలోని కార్మికులకు ఈఎస్‌ఐ కవరేజ్ అందుబాటులో ఉన్నందున ఈఎస్‌ఐ పరిధిలో బీమా చేయించుకున్న వారి సంఖ్య  ఎంత అని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి గురువారం సమాధానమిచ్చారు. విశాఖలో రూ. రూ. 384.26కోట్లతో నిర్మాణమవుతున్న కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాగ్నస్టిక్ సర్వీసెస్ తదితర ప్రత్యేక  సౌకర్యాలతో పాటు ఆయుష్, సూపర్ స్పెషాలిటీ సేవల ప్రాథమిక, సెకండరీ కేర్ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

వైజాగ్‌లో ఇప్పటికే 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొదట సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోవడంతో కనీసం 400 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రామేశ్వర్ బదులిచ్చారు. విశాఖ నగరంలో 3.45 లక్షల మంది, జిల్లాలో 4 లక్షల మంది కార్మికులు ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో విశాఖపట్నం జిల్లాలో ఒక ఈఎస్‌ఐ ఆసుపత్రి, 9 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉన్నాయని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. 4 లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన విలువైన కానుకగా ఎంపీ జీవీఎల్ అభివర్ణించారు. 

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement