ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్ వైపు దూసుకుపోతున్న టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు రెడీ అయ్యింది. రేపు (ఆదివారం) లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. వరుస ఓటములతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసిన టీమిండియాకు షాక్ తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ చేరేందుకు మరింత దగ్గరకానున్న నేపథ్యంలో రోహిత్ సేన ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా విజయం సాధించాలని చూస్తోంది.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో రెండవ స్థానం లో ఉన్న టీమిండియా ఇంగ్లండ్ జట్టుపై గెలిచి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా… శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇంగ్లండ్‌పై గెలుపు పెద్ద కష్టం కాదు. శుభ్‌మన్ గిల్ పెద్ద స్కోర్‌ను చేయాలని పట్టుదలగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్ మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు బ్యాటింగ్‌లో తిరుగులేని విధంగా ఉంది. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.
నిలిస్తే భారీ స్కోరు ఖాయమే..
బజ్ బాల్ ఆటతో వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. భారత్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం స్థాయికితగ్గ ఆటను ప్రదర్శించలేకపోతుంది. ఇక రేపు జరగనున్న మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటిముఖం పట్టడం ఖాయమైనట్లే. అయితే, ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ తమదైన రోజున ఎంత విధ్వంసం సృష్టిస్తారో క్రికెట్ ప్రేమికులకు తెలుసు. రూట్ కూడా రాణించాలని చూస్తున్నాడు. రీస్ తోప్లే బౌలింగ్ ఫామ్ ఆందుకోవాలని బ్రిటీష్ జట్టు కోరుకుంటోంది.
అంచనా జట్లు..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ .