Saturday, November 23, 2024

గత రబీ బియ్యం సేకరణకు మరోసారి గడువు పెంపు.. ఇదే చివరిది : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణతో నెలకొన్న ధాన్యం సేకరణ వివాదంపై కేంద్రం స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2020-21 రబీ సీజన్లో పండిన వరి ధాన్యాన్ని మిల్లుపట్టించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు అప్పగించేందుకు మరోసారి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31లోగా మిగిలిన ధాన్యాన్ని మిల్లు పట్టించి సెంట్రల్ పూల్‌కు అప్పగించాలని పేర్కొంటూ, మరోసారి గడువు పెంపు ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ధాన్యం సేకరణ ఖర్చులను 2020-21 ధరల పట్టిక ప్రకారం కేంద్రం చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో బియ్యాన్ని ‘రీసైక్లింగ్’ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ కట్టడి చేయాలని సూచించింది. ఎఫ్‌సీఐ తనిఖీల సమయంలో బయటపడ్డ మిగులు బియ్యాన్ని మాత్రమే సెంట్రల్ పూల్‌కి అంగీకరించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిల్లులవారిగా లేవీ బియ్యం మిగులుపై గణాంకాలు సేకరించి తీసుకుని, ఆ ప్రకారం సేకరించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం ఆదేశించింది. అలాగే ప్రొటోకాల్ ప్రకారం ఎఫ్‌సీఐకి చేరుకునే బియ్యానికి ‘ఏజ్ టెస్ట్’ (బియ్యం ఏ సీజన్‌కి చెందినవో తెలిపే పరీక్ష) నిర్వహించాలని కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏడోసారి పొడిగింపు

2020-21 రబీ సీజన్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సరఫరా చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ 6 సార్లు గడువును పొడిగించిన కేంద్రం, తాజాగా మరోసారి పొడిగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విటర్లో స్పందించారు. 6 పర్యాయాలు గడువు పొడిగించినా సరే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం సరఫరా చేయకపోయిందని, చివరిసారిగా అవకాశమిస్తూ మే 31లోగా 2020-21 రబీ సీజన్‌కు సంబంధించిన మిగిలిన ధాన్యాన్ని సరఫరా చేయాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఆయన తన ట్వీట్‌కి జతపరిచారు. గతవారం తాను రాసిన లేఖకు స్పందించి, ఈ అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ ప్రభుత్వానికి రైతుల శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం తెలియజేస్తుందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement