Saturday, November 23, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ.. సెప్టెంబర్‌ నెల వేతనంతో కలిపి చెల్లింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ నెల వేతనంతో కలిపి ఈ డీఏ మొత్తాన్ని సంస్థ ఉద్యోగులకు చెల్లించనుంది. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జన్నార్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందనీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందని పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారనీ, మిగతా పెండింగ్‌ బకాయిలను కూడా త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు 8వ డీఏ మంజూరు చేసేందుకు టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించడం పట్ల ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. అలాగే, 2023 జూలై డీఏ కూడా మరో 5 శాతం చెల్లించాల్సి ఉందనీ, ఆ డీఏను కూడా అమలు చేయాలని కోరింది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియను పూర్తి చేయడానికి ముందే డీఏలతో పాటు 168 నెలల ఏరియర్స్‌ చెల్లిస్తే ప్రతీ కార్మికునికి రూ.1,50, 000కు పైగా వస్తుందనీ, దీంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని పేర్కొన్నారు. అందువల్ల యాజమాన్యం ఆలోచించి 8 డీఏల ఏరియర్స్‌ చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈయూ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement