కారును మరోకారు ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన ఘటన హర్యానా రాష్ట్రంలో సంభవించింది. కారు టైర్ పంచర్ కావడంతో మార్చుకునేందుకు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపారు. అయితే.. అంతలోనే ప్రమాదం వారిపైకి దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన మరో కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదం సోమవారం తెల్లవారుజామున హర్యానాలోని రేవారి ప్రాంతంలో చోటుచేసుకుంది. సాని గ్రామంలో గవర్నమెంట్ పాఠశాల దగ్గర కొందరు రోడ్డు పక్కన కారు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో ఆ కారులోని వారు వాహనాన్ని రోడ్డు పక్కకే ఆపారు. ఆ తర్వాత టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చీకట్లో వేగంగా మరో కారు దూసుకొచ్చింది. కారు నిలిపి ఉండటాన్ని గమనించకుడా దాన్ని ఢీకొట్టారు. దాంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితులు ఢిల్లీలోని కథు విలేజ్ నుంచి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.