Tuesday, November 26, 2024

TS | డిగ్రీలో మరో విడత దోస్త్‌ కౌన్సెలింగ్‌.. 28 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పటి వరకు పలు దఫాలుగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజనీరింగ్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత దోస్త్‌ అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది.

శనివారం నాడు ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో దోస్త్‌ అడ్మిషన్లపై రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల వీసీలతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి ఈమేరకు సమావేశమయ్యారు. ఈనెల 28 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులందరూ దీనికి అర్హులని పేర్కొన్నారు.

- Advertisement -

సెప్టెంబర్‌ 9న స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెప్టెంబర్‌ 11 నుంచి 15వ తేదీ వరకు రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో 16 సెక్టార్‌ స్కిల్‌ కోర్సులను రాష్ట్రంలోని 64 కళాశాలల్లో ప్రారంభించినట్లు ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.

అందులో 29 ప్రభుత్వ, 35 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలున్నాయని వెల్లడించారు. అలాగే బీఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ హానర్స్‌, బీఎస్‌సీ బయోటెక్నాలజీ హానర్స్‌ కోర్సులను నూతనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈసమావేవంలో విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌, వీసీలు డి.రవీందర్‌, సీహెచ్‌ గోపాల్‌ రెడ్డి, ఎస్‌.మల్లేశం, ఎల్వీ.లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement