Wednesday, November 20, 2024

ఏపీలో మరో ఆనందయ్య.. ఐదురోజుల్లో కరోనా ఖతం అంటూ ప్రచారం

ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు గురించే చర్చ జరుగుతోంది. రెండు రోజుల్లో కరోనాను తగ్గించే ఔషధంగా ఆనందయ్య ఇచ్చే మందు ఫేమస్ అయింది. అయితే ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఆ మందులో ఏం వినియోగిస్తున్నారు. ఎలా తయారు చేస్తున్నారు. అందులో వాడే మూలికలతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే వాటిపై పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఆనందయ్య అధికారులకు డెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మందు పంపిణీ నిలిచిపోయింది. కాగా ఏపీలో మరోచోట కరోనాకు ఆయుర్వేద ఔషధం పంపిణీ జరుగుతోంది.

ఆనందయ్య మాదిరిగానే ఓ వ్యక్తి ఐదు రోజుల్లో కరోనా ఖతం అవుతుందంటూ ప్రజలకు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారి బంధువులు మందు కోసం క్యూ కడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు వసంత్ కుమార్ కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు. తిప్పతీగ, మచ్చింత తీగ, పెదపల్లేరు కాయలు ఇలా 8 రకాల మూలికలను కలిపి గుళికలుగా తయారు చేసి కరోనా రోగులకు అందిస్తున్నారు. గోరు వెచ్చని నీటితో ఐదు రోజుల పాటు ఈ మందు వేసుకుంటే కరోనా తగ్గుతుందని వసంత్ కుమార్ చెప్తున్నారు. దీంతో రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు రాజవోలుకు పరుగులు పెడుతున్నారు.

ఆయుర్వేద వైద్యుడిగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ మందు తయారు చేస్తున్నట్లు వంసత్ కుమార్ చెబుతున్నారు. ఇందులో ఎలాంటి హానికారకమైన మూలికలు లేవని.. ఖచ్చితంగా కరోనా వైద్యంలో ఇది పనికొస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి సహకారం అందిస్తే ప్రజలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్ గానీ, ఆయుష్ శాఖ అధికారులు గానీ వస్తే డెమో ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై ఎలాంటి పరీక్షకైనా సిద్ధమన్నారు. అయితే దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. చుట్టుపక్కల వారు మాత్రం కరోనాను తగ్గించుకునేందుకు ఈ ఆయుర్వేద మందును వినియోగిస్తున్నారు. క్రమంగా మందు కోసం రాజవోలు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఐతే ఆనందయ్య తయారు చేసే మందు పంపిణీని నిలిపేసిన ప్రభుత్వం.. వసంత్ కుమార్ ఇచ్చే మందుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement