హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ)కు జర్మనీకు చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌సీ) సర్టిఫికేట్ దక్కింది. సేంద్రీయ పద్ధతిలో యుకలిప్టస్, వెదురు, టేకు, జీడి మామిడి లాంటి అటవీ ఉత్పత్తు (ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదు సంవత్సరాల పాటు తన లోగోను ఉపయోగించుకునేందుకు టీఎస్‌ఎఫ్‌డీసీకి ఎఫ్‌ఎస్‌సీ అనుమతినిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యుకలిప్టస్, వెదురు, టేకు, జీడీ మామిడి చెట్లను అత్యున్నత ప్రమాణాలతో సాగు చేస్తూ పంట పండిస్తున్నారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కింది.
దీంతో అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బ్రాండ్ ఇమేజ్ పెరుగనుంది. ఈనేపథ్యంలో ఐకియా లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌సీ ధృవీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కినట్లయింది. దీంతో 5 సంవత్సరాలలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని అధికారులు చెబుతున్నారు. కంపోజిట్ వుడ్ పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధిక ధర లభించనుంది. అటవీ ఉత్పత్తుల నుంచి తయారు చేసిన కాగితం, టెట్రా ప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్‌ఎస్‌సీ ఆమోదం లభించిందని ఈమేరకు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని అధికారులు, సిబ్బందిని అభినందించారు. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంలో పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తుండటంతోనే మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, 30 శాతం రెవెన్యూ కూడా పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అటవీ ఉత్పత్తులను మరింత పెంచుకుని వీటితో వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధిసంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అధికారులు ఎం.ప్రశాంతి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.