Monday, November 18, 2024

కాళేశ్వరం కింద మరో 5లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ఏడాది నుంచి సాగునీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తి పోతల పథకం కింద మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే దిశగా తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రణాళికలు రచిస్తోంది. గోదావరి జలాలను ఎత్తిపోసి మల్లన్నసాగర్‌లో నిల్వ చేస్తుండడంతో సాగునీటి లభ్యత పెరిగింది. మల్లన్నసాగర్‌ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా… ఇప్పటికే 15 టీఎంసీల మేర నీరు నిల్వ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేసిన విషయం విదితమే. మల్లన్నసాగర్‌ అందుబాటులోకి రావడంతో మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం సిద్ధిపేట రంగనాయక్‌ సాగర్‌ వద్ద ఇరిగేషన్‌ శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖకు లక్ష్యాన్ని విధించారు. ఇప్పటి వరకు ఆయా ప్రాజెక్టుల కింద 75లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో రెంటు పంటల సాగుకు సాగు నీరు అందించనున్నారు. ఇందుకోసం కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా కొనసాగిస్తున్నారు.

మూడో టీఎంసీ అందుబాటులోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ప్రస్తుతం వర్షాకాలంలో 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ తెలిపారు. మొత్తం కోటి 25లక్షల ఆయకట్టు లక్ష్యంలో… 75లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. కృష్ణ నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను కేటాయిస్తే, అందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే రాష్ట్ర సాగునీటి రంగంలో గణనీయమైన మార్పు రానుంది. ప్రస్తుతం కృష్ణలో 66:34 శాతం చొప్పున తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తున్నారు. అయితే 50:50 శాతం ప్రాతిపదికన 400 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఇందుకు తెలంగాణ ఏర్పాటైన మొదటి ఏడాది 2015లోనే సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తిశాఖ అభ్యర్థన పెట్టుకుంది. అయితే కేంద్రం స్పందించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత కేంద్రం హామీపై కేసు ఉపసంహరించుకుంది. అయినప్పటికీ కేంద్రం మాట మార్చి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకపోవడం, ఉన్న ట్రిబ్యునల్‌కు సమస్యను విన్నవించకపోవడంతో తెలంగాణకు కృష్ణ బేసిన్‌ అవసరాలకు అందాల్సిన సాగు నీరు అందడం లేదు. దీంతో పాలమూరు- రంగారెడ్డితోపాటు అనేక ఎ త్తిపోతల పథకాలకు సాగునీరు అందడం గగనంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement