మెగా ఫ్యామిలీకి మాత్రం మేలు జరిగింది
చిరంజీవిని వరించిన పద్మ విభూషణ్
పొలిటికల్‌గా రాణించిన పవర్ స్టార్ పవన్
ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక ముద్ర
పలువురు ప్రముఖులకు మిగిలిన చేదు అనుభవం
బడా నిర్మాతలకు గడ్డు పరిస్థితి
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై సర్కారు నిర్ణయం
జానీ మాస్టర్, మోహన్‌బాబు, బన్నీపై కేసులు
నాగార్జున ఎన్ కన్వెన్షన్ నేలమట్టం
చెరువు శిఖంలో కన్వెన్షన్ కట్టారనే ఆరోపణలు
రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప-2
₹1700 కోట్ల గ్రాస్ దాటినట్టు సినీ వర్గాల సమాచారం
ఆంధ్రప్రభ స్మార్ట్, సినిమా డెస్క్: ఈ ఏడాది (2024) సినీ పరిశ్రమకు కలిసి రాలేదు. మెగా ఫ్యామలీకి మాత్రమే మేలు చేసి వెళ్తున్న 2024… మిగిలిన నటులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అక్కినేని నాగార్జునకు కుటుంబ పరంగా శుభపరిణామం జరిగినా ప్రభుత్వ విధానంతో ఆర్థికంగా నష్టపోయారు. అల్లు అర్జున్, జానీ మాస్టార్, మోహన్ బాబుకు పోలీస్ కేసులు చుట్టుముట్టాయి. అల్లు అర్జున్ కేసుతో ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకూ మధ్య గ్యాప్ పెరిగిందనే విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేయడానికి సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. ఇక.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభీషణ అవార్డు రాగా, చిరంజీవి సోదరుడు పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి వరించింది.
చిరు.. పద్మ విభూషణ్
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. దేశంలో కళాకారులకు ఇచ్చే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ మే 9వ తేదీన చిరంజీవికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్న చిరంజీవికి జాతీయ స్థాయి పద్మ విభూషణ్ లభించడం మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పద్మ అవార్డులు అందుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కూడా సన్మానం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా చిరంజీవికి సన్మానం చేశారు. చిరంజీవి నట జీవితంలో ఇదో మైలు రాయి అనే చెప్పుకోవాలి.
డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న పవన్ 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రజల్లోనే నిత్యం ఉంటూ.. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. 2024 పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసి వచ్చింది.
శుభాలు.. చేదుఅనుభవాలు
ఈ ఏడాది ఒక రకంగా అక్కినేని నాగార్జునకు కుటుంబ పరంగా కాలం కలిసి వచ్చినా… ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది నాగార్జున కుమారుడు నాగచైతన్యకు రెండో వివాహం జరిగింది. సమంతతో విడిపోయిన చైతన్య మరో నటి శోభితాతో వివాహం జరగడం శుభపరిణామం. అయితే .. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చి వేసింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలున్నాయి. దీంతో తుమ్మిడికుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో చెరువు ఎఫ్టీఓల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ భవనాలను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నాగార్జున సుమారు ₹400 కోట్ల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
పోక్సో కేసులో జానీ మాస్టర్..
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీకి ఈ ఏడాది చేదు అనుభవం ఎదురయ్యింది. మాయనిమచ్చగా లైంగిక దాడి కేసు మారింది. జూనియర్ కొరయోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడిన జానీ మాస్టర్‌ను సెప్టెంబర్ 20న నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటుండగా తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసు మాత్రం కొనసాగుతోంది.
కుటుంబ గొడవతో ప్రారంభమై..
సినీ నటుడు మోహన్‌బాబు ఈ ఏడాది గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయనకు ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. కుటుంబ గొడవతో ప్రారంభమైన వివాదం పోలీసు కేసు దాకా వెళ్లింది. ఆయన కుమారుడు మనోజ్‌కు.. విష్ణు, మోహన్‌బాబుకు మధ్య వచ్చిన వివాదం పోలీసు స్టేషన్ వరకు దారితీసింది. ఈ క్రమంలో మోహన్‌బాబు ఓ మీడియా సంస్థ రిపోర్టర్‌పై దాడి చేసిన ఘటన మరింత తీవ్రమైంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో అరెస్టు చేయాలనే ఆదేశాలున్నాయి. ప్రస్తుతానికి మోహన్ బాబును అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.