న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్‌లో జీ-20 పర్యాటక, సాంస్కృతిక మంత్రుల సదస్సు గురించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం తొలుత ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ సమావేశమయ్యాక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మాదిరిగా తమది కుటుంబ పార్టీ కాదని, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ క్యాడర్ ఆధారిత పార్టీ అని చెబుతూ.. కార్యకర్తల మనోగతం ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేస్తామని తేల్చి చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సెప్టెంబర్‌లో తొలి జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. సస్పెండైన రాజా సింగ్ విషయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతితో పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన తర్వాత తమ ప్రచార యాత్రలు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీకి చెందిన 100 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు తెలంగాణ ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నేతలు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారని ఆయన గుర్తుచేశారు.
సోదరీమణులకు ప్రధాని రాఖీ కానుక
రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా దేశంలోని సోదరీమణుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ ధరపై సబ్సిడీ ప్రకటించారని కిషన్ రెడ్డి అన్నారు. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 200 తగ్గించడంతో పాటు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు అదనంగా మరో రూ. 200 (మొత్తం రూ. 400) తగ్గించినట్టు వెల్లడించారు. ఈ సబ్సిడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, నేరుగా సబ్సిడీ సొమ్మును లబ్దిదారుల ఖాతాలో వేస్తుందని తెలిపారు. గతంలో అంతర్జాతీయ కారణాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ప్రధాన మంత్రి కేంద్ర పన్నులను తగ్గించి, రాష్ట్రాలను కూడా తగ్గించాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. ప్రధాని పిలుపు మేరకు అనేక రాష్ట్రాలు రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం మాత్రం తగ్గించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజలపై భారాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.