న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రస్తుతం పీడదినాలు ఉన్నాయని, మంచిరోజులు రాగానే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని అనుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాష్ట్రంలో రాజకీయ సునామీ రాబోతోందని అన్నారు. ఆ సునామీలో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పదేళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజలను మోసగిస్తూ వచ్చాయని, హామీలను అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల కారణంగా పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని నిందించారు.
ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తోందని, అది ‘ప్రజాస్వామ్యం’ అని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదని, సామాజిక న్యాయం జరగడం లేదని, సమానమైన అభివృద్ధి లేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలిసినవారిని, వారి కష్టాలు తీర్చగలిగేవారిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని సర్వేలు చెప్పడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఆ అధికారులపై వేటు వేయాలి
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొందరు అధికారుల బదిలీలు, కొత్త అధికారుల నియామకాలు జరిగాయని, అయితే ప్రధానంగా రాష్ట్ర డీజీపీతో పాటు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగరావు, భుజంగ రావు తదితరులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిలో చాలామంది ఎప్పుడో రిటైర్ అయ్యారని, ఇలాంటి అధికారులను తొలగించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్‌పై ఉందని అన్నారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పదవీ విరమణ పొంది చాలాకాలం అయిందని, రిటైర్డ్ అధికారులను ప్రైవేట్ సైన్యంగా మార్చుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక శాఖ అధికారి రామకృష్ణా రావు నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ చెప్పినవారికి నిధులు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తప్పుడు విధానాలతో నిధులు విడుదల చేస్తున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ల్యాండ్ కన్వర్షన్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు వీళ్లందరినీ వదిలేసి కొద్ది మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారని రేవంత్ తెలిపారు. వీళ్లందరిపై రాతపూర్వక ఫిర్యాదు చేస్తామని, ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు.
మరోవైపు తమ పార్టీకి సన్నిహితంగా ఉన్న 75 మంది శ్రేయోభిలాషుల వివరాలను బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని, వారిపై నిఘా పెట్టి బెదిరించే పనులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను, నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నిందించారు.
కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి ఏమీ తెలీదు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అమెరికాలో బాత్రూంలు కడిగిన వ్యక్తికి కాంగ్రెస్ ప్రక్రియ, విధానాలు తెలియవని అన్నారు. అభ్యర్థుల గుణగణాలు, బయోడేటా, పార్టీకి విధేయత వంటి ఎన్నో అంశాలను పరిశీలించి గంటల కొద్ది కసరత్తు చేసి జాబితా తయారు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, జార్జ్, అధిర్ రంజన్ చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారని, వారంతా ఒక్కో నియోజకవర్గంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు.
రేవంత్ పైసలు తీసుకుంటున్నాడని కేటీఆర్ అంటే సరిపోతుందా అని వ్యాఖ్యానించారు. రేవంత్ నిర్ణయంతో టికెట్లు ఖరారు కావని, ఒక ప్రక్రియ – పద్ధతి ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. చిల్లరమల్లర ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.
అందరికీ న్యాయం – ఇదే మా విధానం
తమకు కనీసం 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీసీ నేతల గురించి ప్రశ్నించగా.. నూటికి నూరు శాతం బీసీలకు 34 సీట్లు ఇవ్వాలన్న తాపత్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తాము బీసీలకు కచ్చితంగా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తామని, అందులో అనుమానానికి తావే లేదని తెలిపారు. ఉదయ్‌పూర్ తీర్మానం ప్రకారం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని, ఈ అన్ని వర్గాలకు కలిపి 50 శాతం కంటే ఎక్కువ సీట్లే వస్తాయని వివరించారు.
జాబితా విడుదలయ్యాక అందరికీ అర్థమవుతుందని అన్నారు. మరోవైపు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఈ చర్చల బాధ్యత అధిష్టానం అప్పగించిందని తెలిపారు. చర్చలు కొలిక్కి వచ్చా ఆ వివరాలను వెల్లడిస్తామని అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే బస్సు యాత్రలు విడతల వారీగా ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాల్సినందున ఈ ముగ్గురు నేతలు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటారో ఆ ప్రకారం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు చేస్తామని చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణపై అధిష్టానం పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, కేసీఆర్ గడీల పాలన నుంచి విముక్తి కల్పించడం కోసం నాయకత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. 75 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ సంతకం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతే ముఖ్యమంత్రిగా ఉంటారని బదులిచ్చారు.