హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ అమలులోకి రావడంతో రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్‌లు మూతపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తింపు పొందిన గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద అన్నపూర్ణ క్యాంటీన్‌లు లేకపోవడంతో రోగుల సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అటు లాక్‌డౌన్ కారణంగా ఉ.10 గంటల తర్వాత హోటళ్లు, క్యాంటీన్‌లు, టిఫిన్ సెంటర్లు కూడా మూసివేయడంతో రోగుల సహాయకులు తిండి లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
కోవిడ్ ఆస్పత్రుల వద్ద ఆయా దాతలు ముందుకు వచ్చి ఆహార పొట్లాలు అందిస్తున్నా రోగులకు సహాయకులకు అవి సరిపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోవిడ్ ఆస్పత్రుల వద్ద రూ.5కే రుచికరమైన భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్‌లను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు రోగుల సహాయకులు కోరుతున్నారు.