ప్రభుత్వ నిబద్ధత ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామని ట్వీట్ చేశారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అన్నమయ్య డ్యామ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వ స్పందన.. మోకాలడ్డేలా, కంటి తుడుపు చర్యలా ఉండబోదని ఆశిస్తున్నా. మీరిచ్చిన హామీని ఎంత వరకు నిబద్ధతతో నెరవేర్చారో చూసేందుకు మరో నెల రోజులు జనసేన ఎదురుచూస్తుందని.. ఓ న్యూస్ వెబ్ సైట్ కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఇంతకుముందు కూడా అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం, బాధితులకు సాయంపై ట్విట్టర్ వేదికగా పవన్ విమర్శలు చేశారు.
అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి 18 నెలలు గడిచింది. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక. కనీసం ఈరోజుకీ వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలల్లో సాధించింది ఏమిటయ్యా అంటే.. అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారన్నారు. కేంద్ర జల వనురుల శాఖ మంత్రి షెకావత్.. రాజ్యసభలో ఇది (అన్నమయ్య డ్యామ్ ఘటన) రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారని పవన్ కల్యాణ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.