ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రూడో రాజీనామాతో కొత్త నాయకుడిని ఎన్నుకునే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నమైంది.
ఈ క్రమంలో ప్రధాని రేసులో ఆ పార్టీకి చెందిన క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతికి చెందిన అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, అనిత కీలక ప్రకటన చేశారు.
కెనడా ప్రధాని రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఓక్‌విల్లే ఎంపీగా తాను మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. కానీ, వచ్చే ఎన్నికల వరకు ఉన్న తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ టీమ్‌లో తనకు అవకాశం కల్పించినందుకు, కీలక శాఖలను అప్పగించినందుకు, తనను ఎన్నుకున్న ఓక్‌విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలని అనుకుంటున్నట్టు అనిత అన్నారు.
అయితే, వచ్చే అక్టోబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అనేక సర్వేలు, పోల్స్ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే మిగిలి ఉండటం… ప్రభుత్వంపై వ్యతిరేకత రావటంతో ప్రధాని పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.