Tuesday, November 19, 2024

అనుమతుల్లేకుండా కరోనా వైద్యమందిస్తే కఠిన చర్యలు: అనిల్ కుమార్ సింఘాల్

రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల్లేకుండా కరోనా వైద్య సేవలందించే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు, ఆక్సిజన్, మందులు వంటి అత్యవసరాలు కొనుగోలుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని, ఇందుకోసం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో 1,14,299 కరోనా టెస్టులు చేయగా, 23,920 పాజిటివ్ కేసులు నమోదయ్యాని, 83 మంది మృతి చెందారని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 558 ఆసుపత్రుల్లో 55,719 బెడ్లు అందుబాటులో ఉంచామన్నారు. నేటి(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు 33,765 బెడ్లలో కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారు. గుంటూరులో 869, కృష్ణాలో 684 ఐసీయూతో కూడిన బెడ్లన్నీ వినియోగంలో ఉన్నాయన్నారు. కర్నూలులో 358 ఐసీయూతో కూడిన బెడ్లకు గానూ 258 ఖాళీగా ఉన్నాయన్నారు. తూర్పుగోదావరిలో 105 అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు 27,576 ఉండగా, 18,299 పేషంట్లు ఉన్నారన్నారు. 81 కొవిడ్ కేర్ సెంటర్లలో 10,100 మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 27,615 రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు నేడు 14,602 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం అందించిన 437 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను స్వీకరించామన్నారు.


ఇక 104, టెలీ కాల్ సెంటర్ కు తాకిడి పెరిగిందన్నారు. 104 కాల్ సెంటర్ కు, టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ కు ఫోన్ కాల్స్ అత్యధిక సంఖ్యలో వస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 104 కాల్ సెంటర్ నేడు(ఆదివారం) 17,579 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచార నిమిత్తం 7,427 కాల్స్, కొవిడ్ టెస్టులకు 3,773, టెస్టు ఫలితాలకు 2,550, ఆసుపత్రుల్లో అడ్మిట్ కోసం 2,509 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ కు 1,469 ఫోన్ చేసి, వైద్య సలహాలు, సూచనలు అందుకున్నారన్నారు. హోం ఐసోలేషన్స్ లో 92,700ల మందికి పైగా పేషంట్లు ఉన్నారన్నారు. గతేడాది 18 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించుకోగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్య శాఖలో 16,019 మందిని రిక్రూట్ చేసుకున్నామన్నారు. మరో రెండు మూడు వేల పోస్టులను రేపో మాపో భర్తీ చేస్తామన్నారు. ఆక్సిజన్…ఇతర అత్యావసరాల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు…ఆక్సిజన్, మందులు వంటి అత్యావసరాల కొనుగోలుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు. కమిటీ నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీచేసిందన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో అత్యావసరాల కొనుగోలు ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం పెరిగిందన్నారు. ఇదే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరుతున్నామన్నారు.


కరోనా వైద్య సేవలకు అనుమతుల్లేకుంటే కఠిన చర్యలు. రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు…ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా కరోనా సేవలందిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దీనివల్ల సరైన సమాచారం అందకపోవడంతో, కరోనా బాధితులకు ఆక్సిజన్. రెమ్ డిసివిర్ వంటి మందులు ఆయా ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం సరాఫరా చేయలేకపోతోందన్నారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా వైద్య సేవలందించే ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనుమతుల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన ఆసుపత్రులు కెపాసిటీ ఉన్న మేరకే రోగులకు వైద్య సేవలందించాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement