ఏపీలో కరోనా స్థితిగతులపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా మ్యూటెంట్ (రూపాంతరం చెందిన వైరస్) వ్యాపిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మ్యూటెంట్ విస్తరణ కథనాలు అవాస్తవం అని, ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.
ఏపీలో ఓ ప్రమాదకరమైన మ్యూటెంట్ విస్తరిస్తోందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, అందుకు ఆధారాలు ఏమీలేవని, కొత్త స్ట్రెయిన్‌పై సీసీఎంబీ కూడా అధికారిక ప్రకటనలేమీ చేయలేదని సింఘాల్ వివరించారు. కరోనా సెకండ్ వేవ్‌లో అధిక సంఖ్యలో మరణాలు నమోదు కావడం వాస్తవమేనని, కానీ ఆ మరణాలు మ్యూటెంట్ వైరస్ కారణంగానే అని పేర్కొనడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.