Friday, November 22, 2024

అంగ‌న్వాడి సిబ్బంది నిర్ల‌క్ష్యం… విద్యార్థిని స్కూల్లో పెట్టి తాళం వేసి..!

  • పాప కోసం రాత్రి 10 గంటల వరకు వెతుకులాట
  • చివరకు అంగన్వాడి కేంద్రంలోనే స్పృహ కోల్పోయిన అవంతిక
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
  • సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలో ఘటన..

పటాన్ చెరు, ప్రభ న్యూస్ : అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారి ఇంటికి తీసుకెళ్లి అప్ప చెప్పే బాధ్యత అంగన్వాడి సిబ్బందిపై ఉంటుంది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని కూడా ప్రభుత్వం నియమించింది.. కానీ అంగన్వాడి సిబ్బంది తమ నిర్వహిస్తున్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సుమారు రెండున్నర సంవత్సరాల చిన్నారి అవంతిక అంగన్వాడి కేంద్రంలో తాళం వేసి వెళ్లిపోవడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఏడ్చి ఏడ్చి స్ఫృహ త‌ప్పి పడిపోయి ఉంది. ఇది ఇలా ఉంటే అంగన్వాడి కేంద్రం నుంచి మా పాప అవంతిక ప్రతిరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే ఇంటికి వచ్చేదని… రాత్రి 9:30 అయిన ఇంటికి రాకపోవడంతో అంగన్వాడి కేంద్రం సమీపంలోని ఆయా కాలనీవాసులతోపాటు ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, పాడుబడిన బావిలలో కూడా వెతికారు. ఎక్కడ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు పర్యవేక్షించగా అంగన్వాడి కేంద్రం నుంచి ఎక్కడికి కూడా బయటికి రాలేదని… ఏ దారిలో కూడా సీసీ కెమెరాలలో అగుపడుతలేదని పోలీసులు తెలపడంతో తిరిగి అంగన్వాడి కేంద్రంకి వెళ్లి తాళం తీసి చూడగా కేంద్రంలోని ఒక మూలకు ఏడ్చి ఏడ్చి నీరసానికి గురై, మాట రాలేని పరిస్థితిలో స్కూల్ గదిలోనే ఉంది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. సుమారు ఏడు గంటల పాటు అంగన్వాడి కేంద్రంలోని గదిలో చిన్నారి ఏడ్చుకుంటూ ఉండడంతో స్ఫృహ త‌ప్పి పడిపోయినట్లుగా వైద్యులు తెలిపారు, ప్రభుత్వ నిబంధన ప్రకారం అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు వారి వారి ఇంటి వద్దకు పంపించి రావాల్సిన బాధ్యత ఆయాపై ఉంటుంది. కానీ ఇక్కడ అంగన్వాడీ టీచర్, ఆయాలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి చిన్నారిని అంగన్వాడి కేంద్రంలోనే ఉండగానే తాళం వేయడం చూస్తే వారికి విధుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు రాకుండా జిల్లా యంత్రాంగం టీచర్లపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుచున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement