Friday, November 22, 2024

Andhra Pradesh – వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

విజయవాడ – ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద మొత్తం సహాయం అందజేస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా వరద బాధితులకు అందజేశారు. మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో సీఎం చంద్రబాబును విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 10.60 కోట్లని వరద సాయంగా ఉద్యోగులు ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ… వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారన్నారు. విద్యుత్ పునరుద్దరించడంలో విద్యుత్ ఉద్యోగులు అద్బుతంగా పని చేశారని కొనియాడారు. వరద బాధితులకు సేవలతో పాటు.. వరద సాయం కింద ఒక్క రోజు జీతాన్ని ఇచ్చారన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టానికి ఊడతా భక్తిగా విద్యుత్ ఉద్యోగులూ చేయూతనిచ్చారని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు.

మూడు కోట్లు విరాళమిచ్చిన సర్వేపల్లి వాసులు..

- Advertisement -

మరోవైపు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు రూ.3 కోట్లు విరాళంగా వచ్చింది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ రూ.2కోట్ల విరాళం అందజేశారు. సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తరపున మరో రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు నుంచి దాదాపు మరో రూ.50 లక్షలు విరాళం కలిపి మొత్తం రూ.3 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కలక్టరేట్లో సీఎం చంద్రబాబును సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు కలిసి ఈ మేర చెక్‌లను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement