న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోందని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ‘భారత్ జోడో’ యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కి.మీ మేర యాత్రకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. యాత్రా మార్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర రాష్ట్రమంతటా చేయించాలని, తద్వారా ఆ ప్రభావం ఏపీలో కాంగ్రెస్‌పై సానుకూలంగా ఉంటుందని సూచించినట్టు వెల్లడించారు.
దేశంలో నెలకొన్న విద్వేషపూరిత వాతావరణాన్ని పారద్రోలేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 7న రాష్ట్రమంతటా సర్వమత ప్రార్ధనలు చేసి రాహుల్ గాంధీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 8న ఏపీలో అన్ని ప్రాంతాల్లో రాహుల్ గాంధీకి మద్దతుగా పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. పాదయాత్ర దేశం కోసం, మనందరి కోసం అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో ఆలూరు, దానపురం, ఆదోని, పెద్ద తుంబళం, కోస్గి, మాధవరం మీదుగా కొనసాగుతుందని వెల్లడించారు.