Saturday, November 23, 2024

Delhi | పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ : మంత్రి అమర్‌నాథ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం అని ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్‌ఫెయిర్ 2023’లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తోందని, సకల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్టులతో పాటు 10 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా సముద్ర తీర ప్రాంతాభివృద్ధి త్వరితగతిన సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రం పర్యాటక రంగంలో అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్’ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లా తన ఉనికిని చాటుకుంటోందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేశారు. ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లలో 45 వేల ఎకరాలకు పైగా భూమి పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. విస్తారమైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రంలో అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తగిన అవకాశాలున్నాయని తెలిపారు.

- Advertisement -

అత్యుత్తమ సౌకర్యాల కల్పనతో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించి, యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో తమ శాఖ ముందుకు సాగుతోందన్నారు. దేశ టెక్స్టైల్స్ ఎగుమతిలో 13 శాతం రాష్ట్రం నుంచి జరుగుతోందని వెల్లడించారు. 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో 500 చ.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో లేపాక్షి, ఆప్కో, గిరిజన్ కార్పొరేషన్ (జీసీసీ) తదితర స్టాళ్లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నవంబర్ 14 నుండి 27 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కే.సునీత, ప్రిన్సిపల్ సెక్రెటరీ, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, హిమాన్షు కౌశిక్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్, ఆంధ్ర ప్రదేశ్ భవన్, మోపర్తి సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్, ఏ.పీ. పరిశ్రమల శాఖ,  భాను సాయి ప్రతాప్, టెక్నికల్ హెడ్, ఏ.పీ. పరిశ్రమల శాఖ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement