ఏపీలో ఉద్యోగాల భర్తీపై గత నెలలో సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మొదటిది జ్యాబ్ క్యాలెండర్ విడుదల కాగా.. రెండోది ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దు చేయడం. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో అధికారులు పేర్కొన్నారు.
అయితే.. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ జూలై నెలలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఈ నెలలో భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఈ నెల 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హతల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా భర్తీ చేసే పోస్టులకు మాత్రం ఈ విధానం వర్తించదని ప్రభుత్వం తెలిపింది. కాగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం