Tuesday, November 19, 2024

Andhra Pradesh – పల్నాడు పోలీసులపై ఈసీ కన్నెర్ర – ప‌లువురిపై వేటు

పలు సమస్యాత్మక నియోజకవర్గాల్లో అధికారులపై వేటు
నాయకుల వద్ద ‘న్యాయం’ చేస్తామంటూ లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
అనునిత్యం బడా నాయకులతో టచ్‌లో ఉంటున్నారన్న ఆరోపణలు
సమస్యాత్మక నియోజకవర్గాలపై ఈసీ ప్రత్యేక దృష్టి
పలువురు సీఐలు, ఎస్‌ఐల బదిలీలకు రంగం సిద్ధం
పల్నాడు ఎస్‌బి సీఐపైనా వేటు తప్పదా
గురజాల డీఎస్పీ వ్యవహార శైలిపైనా విమర్శలు

- Advertisement -

గుంటూరు జిల్లా క్రైం, (ప్రభ న్యూస్‌) : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ జరగనున్న సమయంలో ఎన్నికల కమిషన్‌ పోలీసు సిబ్బంది పనితీరుపై నిశితంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. సమస్యాత్మక , అతిసమస్యాత్మక నియోజకవర్గాల్లో ఘర్షణలు, గొడవలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరుపై డేగ కన్ను వేసింది. కాగా, పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ లో కొందరు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుంటూ.. నిత్యం వారితో సామాజిక మాధ్యమాల్లో టచ్‌లో ఉంటూ ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చిన్న గొడవ జరిగినా అధికారపార్టీ వ్యక్తులను వదిలేసి, ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొందరు రాజకీయ నాయకులపై ముందస్తు గానే వారికి అనుకూలంగా ఉండేందుకురూ.లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. సదరు నాయకులపై గాని, వారి అనుచరులపై గాని కేసులు పెట్టడంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు గాను ఈ సొమ్మును డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల, కారంపూడి, నాగార్జున సాగర్‌, వెల్దుర్తి పోలీస్‌ అధికారులు పారదర్శకంగా పనిచేయకుండా, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని.. కొందరు ప్రతిపక్ష నేతలను బెదిరించి సొమ్ము వసూలు చేశారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ కొరడా ఝుళిపించబోతున్నట్లు సమాచారం. ఆయా స్టేషన్ల అధికారులపై బదిలీ వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గురజాల నియోజకవర్గం విషయానికి వస్తే..

గురజాల డీఎస్పీ పనితీరు పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత జరిగిన ఒక అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సదరు పార్టీకి ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని హుకుం జారీచేసినట్లు తెలిసింది. సదరు డీఎస్పీ పరిధిలో ఉన్న పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం పోలీసు అధికారులు అధికార నేతలతో అనునిత్యం టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. తమకు ఆయా పోలీస్‌ స్టేషన్లలో పోస్టింగ్‌లకు గాను సహాయ పడిన నేతలకు వారు అనుకూలంగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లక్షల్లో సొమ్ము వసూళ్లు..
సమస్యాత్మక నియోజకవర్గాలైన గురజాల, మాచర్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలోని అధికారులకు రాజకీయ నేతల నుంచి ముడుపులు భారీగా ముట్టినట్లు తెలుస్తోంది. నేతలను బెదిరించి డీఎస్పీ స్థాయికి రూ. పది లక్షలు, సీఐ కి రూ.5 లక్షలు, ఎస్‌ఐలకురూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.

ఎస్‌బి సీఐపై సైతం..
జిల్లా ఎస్పీకి కళ్లు, చెవులై ఉండాల్సిన స్పెషల్‌ బ్రాంచి అధికారులు ఎస్పీ కళ్లు గప్పి అవినీతి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిత్యం అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ సున్నితమైన సమాచారాన్ని సైతం ఉన్నతాధికారులకు కాకుండా సదరు నేతలకు అందజేస్తూ భారీగా ముడుపులు అందుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాలపై ఈసీకి పూర్తి సమాచారం అందడంతో ఆరోపణలున్న అధికారులందరిపై వేటు పడనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement