Tuesday, November 26, 2024

ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాతల ఖాతాల్లో రూ.3,928 కోట్లు జమ

వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం అందిస్తున్నామన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఇప్పటివరకు రూ.13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. 23 నెలల పాలనలో రైతులకు రూ.68 వేల కోట్లు సాయం చేశామని, రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్‌ కోసం రూ.1700 కోట్లు కేటాయించామన్నారు. ఈ నెల 25న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రూ.2 వేల కోట్లు అందించనున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని సీఎం జగన్‌ తెలిపారు.

అటు వ్యాక్సిన్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దేశంలో 18 ఏళ్లు పైబడ్డ వారికి 172 కోట్ల టీకా డోసులు కావాలని.. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం ఇచ్చింది కేవలం 18 కోట్ల టీకా డోసులు మాత్రమేనని తెలిపారు. ఏపీలో 18 ఏళ్లుపైబడ్డ వారికి 7 కోట్ల టీకా డోసులు కావాలని.. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చింది 73 లక్షల టీకా డోసులు మాత్రమేనని సీఎం వివరించారు. దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని.. నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం జగన్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement