విశాఖపట్టణం, ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 05వ తేదీ వరకు విశాఖపట్టణం పోర్టు స్టేడియంలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మన్ కోసం జరిగే ర్యాలీ విజయవంతంగా సాగేందుకు అధికారులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించి ఆర్మీ, జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అక్కయ్యపాలెం వద్ద గల పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన యువత పాల్గోనున్నారని పేర్కొన్నారు. స్టేడియం వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, డస్ట్ బిన్స్ ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. అభ్యర్థులు వేచి ఉండేందుకు మూడు హాళ్లు, రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ఆరు హాళ్లను, అవసరమైన ఫర్నీచర్, పెడస్టల్ ఫ్యాన్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ మల్లింపు వంటి చర్యలు చేపట్టాలని డీసీపీకి చెప్పారు. బారికేడింగ్, ట్రాక్, ఎంక్లోజర్స్, ర్యాలీకి అవసరమైన స్టాండులను ఏర్పాటు చేయాలని ఆర్ & బి అధికారులకు సూచించారు.
వైద్య బృందాలను, రెండు అంబులెన్సులను, అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులతో పాటు దగ్గరలో ఆసుపత్రి ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు చెప్పారు. ర్యాలీకి సంబంధించి విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. అనౌన్స్మెంట్ వద్ద హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషా పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. కోచ్ లను అందుబాటులో ఉంచాలని డీఎస్డిఓను, వేదిక వద్ద అగ్నిమాపక యంత్రాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎఫ్ఓను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, రెండు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులకు చెప్పారు. హైస్పీడ్ ఇంటర్నెట్, ప్రింటర్లు, ల్యాప్టాపులు, కంప్యూటర్లు ఇతర సామాగ్రి సమకూర్చాలని డీఐఓకు సూచించారు. అల్పాహారం, భోజన ఏర్పాట్లను చేయాలని డీఎస్వోకు చెప్పారు. ప్రతి అధికారికీ అప్పగించిన విధులను బాధ్యతగా వ్యవహరించి ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ శశాంక్, డీఆర్వో కె. మోహన్ కుమార్, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, ఏడీసీపీ, ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.