అమరావతి, ఆంధ్రప్రభ: దేవాదాయ శాఖలో గ్రేడ్-3 కార్యనిర్వహణాధి కారుల భర్తీపై రగడ జరుగుతోంది. దేవదాయశాఖ ఉన్నతాధికారులు చేప ట్టిన గ్రేడ్-3 ఈవోల నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన సంచికలో ‘నిరుద్యోగులకు శఠగోపం’ పేరిట వచ్చిన కథనం రాష్ట్రవ్యాప్త కలకలం రేపింది. పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయగా..దేవదాయశాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు గ్రేడ్-3 నియామకాలపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీస్తున్నారు. సీఎంవో ఆరా తీస్తున్న నేపధ్యంలో ఆదివారం దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ తదితరులతో వీటిపై సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలకు, అర్చకులకు ఇచ్చేందు కు సాక్షాత్తు మంత్రిమండలి సైతం ఆమోదించిన తరుణంలో. .హడావుడిగా కోర్టు ఆదేశాలంటూ గ్రేడ్-3 ఈవోల నియామకం చేపట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
గ్రేడ్-3 ఈవోల నియామకంపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈవోల నియామకాల్లో 20శాతంగా ఉన్న ఆలయ ఉద్యోగుల కోటాను..40శాతానికి, ప్రధాన కార్యాలయాల్లో పని చేసే మఫిషియల్ ఉద్యోగులకు 10శాతం కేటాయిస్తూ చట్ట సవరణ చేశారు. మిగిలిన 50శాతం పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా నేరుగా నియామకాలు చేపట్టాలని చట్టంలో పొందుపరిచారు. ఇదే అంశంపై గతంలో పలుమార్లు ఆలయాలు, వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు సీనియారిటీ ప్రాతిపదికన గ్రేడ్-3 పదోన్నతులు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో జీవో ఎంఎస్ నెం.153 జారీ చేస్తూ దేవదాయశాఖలోని 60 గ్రేడ్-3 ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ 2019లో నోటిఫికేషన్ జారీ చేసీ తదనంతరం అర్హతా పరీక్షలు నిర్వహించింది. గత ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి తుది ఫలితాలు జారీ చేస్తూ దేవదాయశాఖకు పంపింది. ఇదే క్రమంలో దేవదాయశాఖలో 178 ఖాళీలు ఉండగా, 60 ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే మిగిలిన 118 పోస్టులు తమకు ఇవ్వాలంటూ ఆలయ ఉద్యోగులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..గత ఏడాది సెప్టెంబర్‌లో వీరికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీనిపై దేవాదాయశాఖ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు.
చట్ట ప్రకారం చెల్లదు..
దేవాదాయశాఖ అధికారులు ఆలయ, ఛారిటీ సంస్థల ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతి ఇస్తూ గ్రేడ్-3 ఈవోల నియామకాన్ని ఇటీవల చేపట్టారు. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పదోన్నతులు ఇచ్చేశారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఇదే తరహాలో పదోన్నతులు ఇవ్వగా వివాదం నెలకొనడంతో అప్పటి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వీటిని ఆపేశారు. తిరిగి ఇటీవల చేపట్టారు. ప్రకాశం జిల్లాలో చేపట్టిన నియామకాల ఉత్తర్వుల్లో డైరెక్ట్(నేరు)గా నియామకం అయ్యే గ్రేడ్-3 ఉద్యోగులు వచ్చిన పక్షంలో వీరు తిరిగి ఆలయ ఉద్యోగులుగా కొనసాగుతారని, వీరికి ఏ విధమైన పెన్షన్ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగి అయితే ట్రజరీ నుంచి వచ్చే జీతాలను వదులుకునేందుకు ఏ ఒక్కరూ అంగీకరించారు. అప్పుడు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయంటూ గతంలో దేవదాయశాఖ కమిషనర్‌గా ఉన్న వైవీ అనురాధ తిరస్కరించారు. ఇప్పుడు అదే తరహాలో నియామకాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.5లక్షల లోపు ఆలయాల నిర్వహణ వీరిదే..
రాష్ట్రంలోని రూ.5లక్షల లోపు ఆలయాలు, సంస్థల నిర్వహణ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులకు అప్పగించేందుకు ఈ నెల 7న జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. వచ్చే అసెంబ్లిd సమావేశాల్లో చట్ట సరవణ కూడా జరగబోతోంది. ఇదే జరిగితే ఇప్పుడున్న ఈవోల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పట్లో నేరు(డైరెక్ట్)గా నియామకాలు చేపట్టే అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పటికిప్పుడు గ్రేడ్-3 ఈవోల నియామకం చేపట్టాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
దుష్ప్రచారం చేస్తున్నారు..
దేవాదాయశాఖలోని కొందరు అధికారులు తమకు పదోన్నతులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక కమిషనర్‌పై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఏపీ దేవాదాయ, ధర్మాదాయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ ఆరోపించారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఆయా సంస్థల్లో చాలీచాలని జీతాలతో పని చేస్తున్న తమకు న్యాయబద్దంగా రావాల్సిన పోస్టులనే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హైకోర్టు సైతం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సర్వీసు కమిషన్ నియామకాలను తాము అడ్డుకుంటున్నామనడం వాస్తవం కాదంటూ తమకు రావాల్సినవే అడుగుతున్నామన్నారు. ఇప్పటికే సర్వీసు కమిషన్ ద్వారా 60మందికి నియామక ఉత్తర్వులు కూడా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా నిరుద్యోగులకు అన్యాయం జరగడమనేది అవాస్తవమన్నారు. ఇటీవల సీఎం జగన్మోహన రెడ్డి ఏపీపీఎస్సీ పోస్టులను సైతం ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు వీ.రాఘవరావు, ఎం.వెంకటేశ్వర రెడ్డి, కే.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.