Saturday, November 23, 2024

కె. శ్రీనివాసరెడ్డి గారూ.. సిగ్గుపడండి!

మీరొక సీనియర్ జర్నలిస్ట్.. అంతేకాక ఓ జాతీయస్థాయి జర్నలిస్ట్ సంఘ నాయకులు. అలాంటి మీరు ఈ వయసులో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో చేసిన ప్రసంగం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు ప్రముఖులు, మేధావులు, జర్నలిస్టులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓ జర్నలిస్ట్ గా దివంగత వైఎస్ తో మీకున్న అనుభవాన్ని తెలియజేసే అవకాశాన్ని నిర్వాహకులు ఈ సభలో మీకు కల్పించారు. కానీ అందుకు భిన్నంగా మీ ప్రసంగంలో ఎప్పుడో 20 ఏళ్ళ నాటి సంఘటనను మీరు ప్రస్తావించారు. వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపేందుకుగాను అప్పట్లో ఆంధ్రప్రభ పత్రికను మూయించి వేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని మరోసారి గుర్తు చేశారు. స్వాతంత్ర్య సంగ్రామానికి అక్షర స్ఫూర్తిని అందించిన ఆంధ్రప్రభ 20 ఏళ్ళ క్రితం మూసివేతకు గురవుతున్న పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆ పత్రిక అభిమానిగా దాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్న తపనతో నేను చేసిన ప్రయత్నాన్ని అప్పట్లో మీరు జీర్ణించుకోలేకపోయారు. ఆంధ్రప్రభను కొనొద్దంటూ నాపై ఒత్తిడి తెచ్చారు. ఒకవేళ కొనుగోలు చేసినా నడవనిచ్చేది లేదంటూ హెచ్చరించారు. ధైర్యం చేసి పత్రికను కొన్నా.. త్వరలో మూసేయడం తప్పదని అప్పుడే స్పష్టం చేసారు. కొని నిర్వహిస్తున్న నాకు,ఆంధ్రప్రభకు వ్యతిరేకంగా మీరు చేపట్టిన ఉద్యమాలకు కారణాలు ఇప్పటికైనా చెప్పగలరా? అప్పటికే 60 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ పత్రికపై మమకారంతో నా ఆస్తులన్నింటిని తనఖా పెట్టి పత్రికను అభివృద్ధి పరుస్తూ నిర్వహించే ప్రయత్నం చేయడం నా తప్పా? మీరు ఏ ఉద్దేశ్యంతో ఈ పత్రిక మూసేయాలని భావించారో మీరు చెప్పగలరా ? ఓ జర్నలిస్ట్ గా.. ఓ జర్నలిస్ట్ నాయకుడిగా ఇది మీ వాద్యతగా పరిగణిస్తున్నారా ? నాతో మీకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు.

కానీ అప్పటికే 20 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశాను. మంత్రిగా రాష్ట్రానికి సేవలందించాను, కాంగ్రెస్ తరపున 2004లో పోటీకి సిద్ధమయ్యాను. నాకు వ్యతిరేకంగా ఢిల్లీకెళ్ళి మీరు సోనియాను కలిశారు. నాకు సీటివ్వొద్దంటూ ప్రాధేయపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ పై ఒత్తిడి తెచ్చారు. ఒకవేళ సీటు ఇచ్చినా కష్టపడి తిరిగి నన్ను ఓడిస్తామంటూ బహిరంగంగా స్పష్టం చేశారు. కాకినాడకొచ్చి వైఎస్ కాన్వాయ్ కు అడ్డంపడ్డారు. ఆంధ్రప్రభను మూయించండంటూ వైఎస్ ను బహిరంగంగా డిమాండ్ చేశారు. మరిన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు, సాటి జర్నలిస్టులు మిమ్మల్ని చీ కొట్టారు. కాకినాడ వాసులు నన్ను 35 వేల ఓట్ల మెజారిటీతో అసెంబ్లీకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? మీకు ఇప్పటికైనా సిగ్గనిపించడం లేదా? ఈ సంఘటనలు జరిగి 20 ఏళ్ళు అయ్యాయి. ఇప్పటికీ మీరు ఏ ఉద్దేశ్యంతో నాపైన, ఆంధ్రప్రభ పైన విద్వేషాన్ని వెదజల్లుతున్నారో కారణాలు చెప్పగలరా? గతంలో కూడా మీరు అనేక సందర్భాల్లో పలు పత్రికల మూసివేతకు ప్రయత్నాలు చేశారు. మీ తీరు, మీ వ్యవహారశైలి.. మీతో పాటు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్ట్ సంఘాల పట్ల సభ్యులు, సాధారణ జనంలో జుగుప్స కలుగజేస్తోంది. ఈ ప్రయత్నాల వెనుక మీ ఆశయాలేంటి? వాటిని సభాముఖంగా బహిర్గత పరిచుంటే సంతోషించి ఉండేవాడిని. ఇప్పటికైనా వాస్తవాలు బహిర్గతం చేయండి.

——– ముత్తా గోపాలకృష్ణా, చైర్మన్, ఆంధ్రప్రభ

Advertisement

తాజా వార్తలు

Advertisement