Wednesday, November 20, 2024

‘ఆంధ్ర’ అంటే దేశంలో ఒక బ్రాండ్.. ఏటా ఐఐటీ టాపర్స్ ఇక్కడి నుంచే వస్తున్నారు : ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఆంధ్ర’ అనే పదం దేశంలో ఒక బ్రాండ్‌గా మారిందని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ 75వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతియేటా ఐఐటీ వంటి పోటీ పరీక్షల్లో టాపర్స్ ఎక్కువగా ఆంధ్ర నుంచే వస్తున్నారని, ఇది గర్వించదగిన విషయమని ఆయనన్నారు. ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం, విద్యాభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు అనేక మంది తల్లిదండ్రులు పోటీపడుతున్నారని చెప్పారు. ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాలలో కూడా ఆంధ్రా విద్యా సంఘం నూతన పాఠశాలను స్థాపించాలని కోరారు. ప్రతిఒక్కరూ నిస్వార్థపూరిత జీవితం గడపాలని, మానవతా విలువల్ని అలవరుచుకోవాలని, సహాయం కోసం ఎదురుచూసే వాళ్ళకు చేయూతనందించాలని అన్నారు. ఢిల్లీలోని ఐటీవో సమీపంలో ఉన్న ఆంధ్రా విద్యా సంఘం ప్రధాన భవంతిలో 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డా. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రతియేటా జులై 15న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ ప్రకాశ్, ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ అధక్షులు డా. ఎమ్‌.ఆర్‌. మూర్తి, కార్యదర్శి ఎస్‌. ఈశ్వర్‌ ప్రసాద్‌, కోశాధికారి వి. ఛటర్జీ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం డా. ఎమ్‌.ఆర్‌.మూర్తిగారు మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగుభాష మాట్లాడేవారికి సేవచేయాలనే దృక్పథంతో డా. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 1948లో ఆంధ్రా విద్యా సంఘాన్ని స్థాపించారని అన్నారు. అనంతరం కార్యదర్శి ఈశ్వర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్రా విద్యా సంఘం స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకూ ఎంతోమంది తమ జీవితాలను సైతం త్యాగం చేసి ఈ సంస్థకోసం పనిచేశారన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో విజయాలను ఈ సంస్థ సాధించిందన్నారు. మన విజయాల్ని, భవిష్యత్తు కర్తవ్యాల్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన విలువల్ని, కర్తవ్యాల్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఆహుతులను అలరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement