న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రసాయనాలు, పెట్రో కెమికల్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఛాంపియన్‌లా దూసుకుపోతోందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ‘ఇండియా కెమ్ – 2022 సదస్సు’లో పాల్గొన్న ఆయన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిశారు. శాలువాతో ఆయన్ను సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 974 కి.మీ పొడవైన సముద్ర తీరం కల్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘ఈస్ట్రన్ గేట్ వే ఆఫ్ ఇండియా’ మారిందని అన్నారు.
ఈ నేపథ్యంలో పోర్ట్ ఆధారిత అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని అన్నారు. పెట్టుబడులకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయసహకారాలు అందజేస్తుందని అమర్‌నాథ్ తెలిపారు. గడచిన మూడేళ్లలో రూ. 46,280 కోట్ల పెట్టుబడులతో 107 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా కొత్తగా 70,606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగామని తెలిపారు. వీటితో పాటు 35,181 చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో 2,11,374 ఉపాధి దొరికిందని వెల్లడించారు.