న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలుగు తేజం అన్నారెడ్డి నాగేశ్వరరావును ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ సగౌరవంగా సన్మానించింది. శనివారం లోధి రోడ్‌లోని ఆంధ్రా అసోసియేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గం కోటగిరి సత్యనారాయణ, మణినాయుడు, మంచిరాజు లహరి, జి.వి.ఆర్.మురళి, సిలార్ ఖాన్, సత్యప్రసాద్, ఎస్.వి.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు. అన్నారెడ్డి నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్చమిచ్చి, జ్ఞాపికతో సత్కరించారు.
ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు ఆయన సేవలను కొనియాడారు. బయాలజీ రంగంలో విశేష కృషి చేసి 35 రకాల ఆర్కిడ్స్ కనుగొన్న శాస్త్రవేత్తగా లిమ్కా బుక్ రికార్డ్ సాధించిన నాగేశ్వరరావు ఖ్యాతిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీకి ఎంపిక చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆంధ్రా అసోసియేషన్ కార్యవర్గం అభినందించింది.