లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఆరంభం మాత్రమే
రానున్న రోజుల్లో మాదే ఇక్కడ అధికారం
కాంగ్రెస్ తొండి ఆడటంతో మీ సీట్లు తగ్గాయి
బీఆర్ ఎస్ 13 స్థానాల్లో ఉనికే లేదు
కాంగ్రెస్ కు గతం కంటే ఓట్లు తగ్గాయి
ఢిల్లీ మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమే అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ఉనికిని కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ 14చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని తెలిపారు. 8చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందన్నారు. విద్యావంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదే అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేం 8 చోట్ల గెలిచామన్నారు. మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారన్నారు.
సామ, భేద, దాన, దండోపాయాలు రేవంత్ రెడ్డి ప్రయోగించినా.. మా అభ్యర్థిపై అసభ్య పదజాలాలు ప్రయోగించినా.. బీజేపీ కార్యకర్తలను బెదిరించినా.. ప్రజలు బీజేపీకే పట్టం గట్టారని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన.. మల్కాజ్‌గిరిలో మా..ఈటెల గారు దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తొండి అట ఆడిందని, బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్ లో పోటీ చేసిందన్నారు. నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.