Friday, November 22, 2024

ఇక టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్‌… టఫే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మొన్న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష పేపరు ఎంత కఠినంగా ఉందో.. ఎంత తికమక ప్రశ్నలు అడిగారో పరీక్ష రాసిన అభ్యర్థులకు, కోచింగ్‌ ఇచ్చిన సెంటర్ల నిర్వాహకులకు చాలా బాగా అర్థమయ్యింది. ఇకమీదట టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ప్రతీ పోటీ పరీక్షల పేపర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఉద్యోగార్థులు, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 16న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌ సివిల్స్‌ స్థాయిలో ఇంత కఠినంగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో కఠినంగా పేపర్‌ రాలేదని పరీక్ష రాసిన అభ్యర్థులు, కోచింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇకమీదట టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించబోయే పోటీ పరీక్షలన్నీ ఈ స్థాయిలోనే ఉంటాయని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష రూపంలో కమిషన్‌ చెప్పకనే చెప్పింది. ఈ నేపథ్యంలో కోచింగ్‌ విధానాన్ని, చదివే తీరును మార్చుకునే పనిలో కోచింగ్‌ సెంటర్లు, నిరుద్యోగులు పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏళ్ల తరబడిగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నవారు రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. అందులోనూ చివరిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇదే మొదటి నోటిఫికేషన్‌ కావడంతో భారీ స్థాయిలో గ్రూప్‌-1కు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,86,051 మంది పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే. అయితే పరీక్ష రాసిన వారిలో దాదాపు ప్రతి ఒక్క అభ్యర్థి సుమారు 15 ప్రశ్నలను ఆన్సర్‌ చేయకుండానే వదిలేసినట్లు కోచింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో సుమారు 90శాతం మంది తమకు సమయమే సరిపోలేదని చెప్పడం గమనార్హం. త్వరలో జరగబోయే పరీక్ష పేపర్లు కూడా ఏ స్థాయిలో టఫ్‌గా ఉంటాయో మనం దీనిని బట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

నో స్ట్రెయిట్‌ క్వశ్చన్లు…

- Advertisement -

ఏమాత్రం అంచనాలకు అందకుండా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌ను టీఎస్‌పీఎస్‌సీ రూపకల్పన చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఎక్కడెక్కడి నుంచో పరీక్షల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువ క్వశ్చన్లు వస్తాయనుకున్న టాపిక్‌ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు వస్తే.. తక్కువ క్వశ్చన్లు వస్తాయనుకున్న సబ్జెక్టుల నుంచి చాలా క్వశ్చన్లను అడిగినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఏ టాపిక్‌ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో ఊహించడంలో కోచింగ్‌ సెంటర్లు దిట్ట. అందులోనూ పోటీ పరీక్షల్లో ఏ తరహా ప్రశ్నలను అడుగుతారో వారు సులువుగా పసిగడ్తారు. అలాంటిది ప్రముఖ కోచింగ్‌ సెంటర్లు కూడా ఊహించనంతగా ప్రశ్నల సరళి గ్రూప్‌-1 పరీక్షలో ఇచ్చారు.

దాంతో త్వరలో జరగబోయే పోటీ పరీక్షల కోచింగ్‌ విషయంలో అటు ఉద్యోగార్థులు, ఇటు కోచింగ్‌ నిర్వాహకులు డైలమాలో పడినట్లుగా తెలుస్తోంది. లక్షల్లో ఫీజులు కట్టి కోచింగ్‌ తీసుకున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం తమ వద్ద ఉన్న పుస్తకాలను పక్కనబెట్టి ఫిబ్రవరివలో జరగబోయే గ్రూప్‌-1 మెయిన్స్‌, ఇతర పోటీ పరీక్షల కోసం వేరే రిఫరెన్స్‌ బుక్స్‌లను చదివే పనిలో పడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటి వరకు దాదాపు 9 నుంచి 12 వరకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వేసినట్లు సమాచారం. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే ఉద్యోగ పోటీ పరీక్షలన్నింటికీ ప్రశ్నపత్రాలను కమిషన్‌ టఫ్‌గానే రూపొందించనున్నట్లు కోచింగ్‌ నిర్వాహకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. దానికనుగుణంగానే కోచింగ్‌ ఇచ్చే విధానాన్ని మార్చుకునే పనిలో ఉన్నారు.
స్ట్రెయిట్‌ ప్రశ్నలు అడగకుండా సమయం ఎక్కువగా పట్టే విధంగా, క్లిష్టతరమైన ప్రశ్నలతో పేపర్లు ఉండే అవకాశముందని కోచింగ్‌ నిర్వాహకులు, అభ్యర్థులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. వెలువడే ప్రతి నోటిఫికేషన్‌కు లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యంలో వారందరినీ వడపోత చేసేలా పేపర్లను టఫ్‌గా తయారు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement