నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో 1.80 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలా దాదాపు 3 లక్షల మందికి మందు అందించనున్నామని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో ఆనందయ్య మందు తయారు చేయడం సంతోషమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ అనుమతులు రాగానే మొదట సర్వేపల్లి మందు ఇవ్వాలని భావించామని, అందుకే ఒకటిన్నర లక్ష ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మందు పాకెట్ ను ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో కుటుంబాలకు చేరుస్తామని తెలిపారు. మందు పంపిణీని రాజకీయం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆనందయ్య మందుపై తాను అవినీతికి పాల్పడి ఉంటే తన కుటుంబం నాశనం అవుతుందన్నారు. ఆనందయ్య మందును ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.